కేంద్రానికి మాజీ ఎమ్మెల్యే కాసు కృతజ్ఞతలు
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను తిరస్కరించిన సందర్భంగా..
పిడుగురాళ్ల: పల్నాడు జిల్లాలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయకుండా తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలని గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా కాసు మహేష్ రెడ్డి సోమవారం వీడియో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ కేంద్రం నిర్ణయానికి తలొగ్గి ప్రభుత్వ మెడికల్ కాలేజీగానే కొనసాగించేందుకు ముందుకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రజలకు మేలు చేసే పనులు చేస్తే ఎప్పుడు స్వాగతిస్తామని కాసు అన్నారు. జాతీయ పాలసీలో భాగంగా పిడుగురాళ్ల, మచిలీపట్నం, పాడేరు మెడికల్ కాలేజీలను మంజూరు చేయటం జరిగిందన్నారు. ప్రధానంగా పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ, వైఎస్సార్ వైద్యశాలను తమ అభ్యర్థన మేరకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంజూరు చేయించారని తెలిపారు. సుమారు 90 శాతం వైద్యశాల పూర్తి అయిందని, 60 శాతం మెడికల్ కాలేజీ పూర్తి అయిందని, ఇటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రాన్ని కోరటం జరిగిందన్నారు. ప్రైవేటీకరణ చేయటం కుదరదని సుచన ప్రాయంగా కేంద్ర ప్రభుత్వం చెప్పటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణ చేసే అవకాశం లేకుండాపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణను తిరస్కరించటంతో నేడు రాష్ట్ర ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీ, వైద్యశాలను పూర్తి చేస్తామని మంత్రి చెప్పటం అభినందనీయమన్నారు. గత ఏడాది జూన్ మాసానికి 100 పడకల హాస్పటల్ నిర్మాణం పూర్తి అయిందన్నారు. ఈ ఏడాదిన్నర కాలంలో వైద్యశాలకు సిబ్బందిని నియమించి, వైద్యపరికరాలను ఏర్పాటు చేసినట్లయితే ఎంతో బాగుండేదని, ప్రజలకు ఎంతో మేలు జరిగేదన్నారు. పల్నాడు ప్రజలకు ప్రభుత్వ పరంగా ఉచిత వైద్యసేవలు అందేవని గుర్తు చేశారు. మెడికల్ కాలేజీ కూడా ఈ ఏడాదికి సీట్లు వచ్చే అవకాశం ఉండేదన్నారు. ఇప్పటికై నా సరే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేసి వచ్చే ఏడాదికల్లా ప్రజలకు, వైద్య విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొని రావాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ పిడుగురాళ్ల సమీపంలో ఉన్న వైఎస్సార్ ప్రభుత్వ వైద్యశాల, కళాశాల ప్రైవేటీకరణను తిరస్కరించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.


