బస్సు దగ్ధం మరణాలు ప్రభుత్వ హత్యలే
మద్య వ్యతిరేక వేదిక నేత ఈదర గోపీచంద్
నరసరావుపేట: నారావారి రాక్షస పాలనలో రాష్ట్రంలో విచ్చలవిడి మద్యం షాపులు, అన్ని గ్రామాలలో వేలాదిగా బెల్ట్ షాపులు వెలసాయని, మొత్తంగా రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ ఒక కుటీర పరిశ్రమగా విలసిల్లుతూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మద్య వ్యతిరేక వేదిక నేత ఈదర గోపీచంద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక పత్రిక ప్రకటన జారీ చేశారు. కర్నూలు జిల్లాలో ప్రైవేట్ బస్సు దగ్ధం, 20 మంది మృతి ఘోరానికి హైవే పక్కనే ఉన్నటువంటి మద్యం బెల్టు షాపులే ప్రధాన కారణంగా తేలటం కూటమి నేతల నికృష్ట పాలనకు నిదర్శనమన్నారు. మద్యం వ్యాపారాన్ని ఆదాయ వనరుగా చూడబోమని, మద్యపాన వ్యసనాన్ని దశలవారీగా తగ్గిస్తామని గొప్ప సదుద్దేశంతో దశల వారి మద్య నిషేధాన్ని 70 శాతం అమలు చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ సుపరిపాలనను ఈ సందర్భంగా ప్రజలు గుర్తుతెచ్చుకుంటున్నారన్నారు. నేటి నారావారి నికృష్ట పాలనలో అన్ని రంగాలలోని అన్న వర్గాల ప్రజలు నరకాన్ని చవిచూస్తున్నారని గోపీచంద్ దుయ్యబట్టారు. ఈ బస్సు ప్రమాద మరణాలు ప్రభుత్వ హత్యలుగానే భావించి, ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని, మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పి రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బెల్టు షాపులన్నింటినీ తక్షణం మూయించి రాత్రిపూట మద్య విక్రయ వేళలు తొమ్మిది గంటలకే కుదించాలన్నారు. హైవేల పక్కనున్న మద్యం షాపులను దూరంగా జరపాలని, ఈ విధమైన సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ, చంద్రబాబు వాటిని నిర్వీర్యం చేశారన్నారు.


