
ప్రభుత్వ విద్యారంగం పరిరక్షణే యూటీఎఫ్ లక్ష్యం
నరసరావుపేట: ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, ఉపాధ్యాయుల సంక్షేమం యూటీఎఫ్ లక్ష్యమని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూలులో ఏర్పాటు చేసిన మధ్యంతర కౌన్సిల్ సమావేశానికి జిల్లా అధ్యక్షులు పి.శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. ప్రారంభ సూచికగా ఎస్‌టీఎఫ్‌ఐ పతాకాన్ని పూర్వ ప్రధాన కార్యదర్శి జి.విజయసారధి, యూటీఎఫ్ పతాకాన్ని సీనియర్ నాయకులు ఎ.నాగేశ్వరరావు ఆవిష్కరించారు. పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.మోహనరావు కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ ధ్యేయంగా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని వేసవి సెలవుల్లో విస్తృత ప్రచారం చేశామన్నారు. పాఠశాలలో విద్యార్థులు ఉంటేనే ఉపాధ్యాయులు ఉంటారని, అవసరమైతే అదనంగా పనిచేసి ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు కట్టుబడి ఉంటామన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై యూటీఎఫ్ అగ్రభాగాన ఉండి పోరాడి సమస్యలు పరిష్కారానికి కృషి చేశామన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలలో రెండు డీఏలను తక్షణమే విడుదల చేసి 30 శాతం ఐఆర్ ప్రకటించాలన్నారు. పీఆర్‌సీ కమిషన్ నియమించాలని మెమో నెం.57అమలు, 2003 డీఎస్‌సీ అభ్యర్థులకు ఓపీఎస్ అమలు చేయాలని, బోధనేతర పనులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలో 2021లో ఐదేళ్లు కాలానికి ప్రపంచబ్యాంక్‌తో ఆంధ్ర సపోర్టింగ్ లెర్నింగ్ ట్రాన్స్‌పర్మేషన్ ఒప్పందం చేసుకుని రూ.1860 కోట్ల అప్పు తీసుకున్నారన్నారు. ఈ పథకం ద్వారా విద్యార్థులను అంతర్జాతీయ విద్యార్థిగా తయారు చేయడం, నాణ్యమైన విద్య అందించడం కాగా లక్ష్యాన్ని నీరుగారుస్తూ ఆన్‌లైన్‌లో సమాచారాన్ని పంపించే పాఠశాలలుగా మార్చారన్నారు. విద్యకు బడ్జెట్‌లో కోత విధించడంతో, విద్యార్థులు, పాఠశాలల సంఖ్య తగ్గి విద్యార్థుల సామర్‌ాధ్యలు తగ్గాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకోవడం కోసం ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడి లేకుండా పనిచేయడం కోసం సాల్టు పథకం రద్దు చేయాలని, దీనికై సామాజిక పోరాటం చేయాలన్నారు. ఉపాధ్యాయులపై యాప్‌ల భారాన్ని తగ్గించాలన్నారు. రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ టిఎస్‌ఎన్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ యూటీఎఫ్ మండల శాఖలు బలోపేతం చేయాలని సభ్యత్వం పూర్తిచేసి ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. నూతన ఉపాధ్యాయులకు తగు సహాయ సహకారాలను అందించాలని కోరారు.
ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష మోడల్ బుక్‌లెట్ ఆవిష్కరణ
ఎనిమిద తరగతి విద్యార్థులకు నిర్వహించే నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకి సంబంధించిన మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మెటీరియల్‌ను జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంయుక్తంగా ప్రచురించిన బుక్‌లెట్‌ను రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్ కాసిం పీరా, సహాధ్యక్షులు జెవిడి నాయక్, జిల్లా సహాధ్యక్షురాలు ఎ.బాగేశ్వరిదేవి, కోశాధికారి ఎం.రవిబాబు, జిల్లా కార్యదర్శిలు మండల బాధ్యులు, సీనియర్ నాయకులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు