
సచివాలయ ఉద్యోగుల పోరుబాట
తెనాలి అర్బన్: కూటమి ప్రభుత్వం జాబ్ చార్టుకు వ్యతిరేకంగా సచివాలయ ఉద్యోగులకు అన్ని రకాల విధులను అప్పగించటం వల్ల వారి ఆత్మగౌరవం దెబ్బతింటోందని డెమోక్రటిక్ ఏపీసీఎస్‌డబ్ల్యూఎస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ బండికల్ల సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తెనాలిలోని సామ్రాట్ హోటల్‌లో శనివారం అత్మగౌరవ సభను నిర్వహించారు. సమావేశానికి జేఎసీ రాష్ట్ర చైర్మన్ జి. జోసఫ్ కిశోర్ అధ్యక్షత వహించారు. సతీష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి వారి విధులను కూడా సచివాలయంలోని ఉద్యోగులకు అప్పగించడం వల్ల సతమతమవుతున్నారని తెలిపారు. వలంటీర్ల కోసం ఏర్పాటు చేసిన క్లస్టర్లను ఉద్యోగులకు బదలాయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని కోరుతున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని విమర్శించారు. ఉద్యోగులపై పని భారం పెంచటం వల్ల మానసిక ఒత్తిడికి గురై కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు జేఎసీలుగా చలామణి అవుతూ తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఉద్యోగులకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల రెండు వేల మందిపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం దిగిందని, వెంటనే దాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నామని చెప్పారు. జేఏసీ రాష్ట్ర వర్కింగ్ సెక్రటరీ అప్పికట్ల కిశోర్ మాట్లాడుతూ మహిళా ఉద్యోగులపై కొందరు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్పష్టమైన జాబ్ చార్టును ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. జేఎసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. కిరణ్ కుమార్ మాట్లాడుతూ నోషనల్ ఇంక్రిమెంట్ ప్రకటించటంతో పాటు హేతుబద్ధంగా పదోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతర్ జిల్లాల బదిలీలకు అనుమతి ఇవ్వాలని కోరారు. సమావేశంలో ట్రెజరర్ దుర్గాప్రసాద్, కన్వీనర్లు జీవన్ సాగర్, మదన్ మోహన్, శంకరరావు, శామ్యూల్, డైమండ్ బాబు, కీర్తి సాగర్ పాల్గొన్నారు.
తెనాలిలో కార్యాచరణ ప్రకటించిన
రాష్ట్ర జేఎసీ నాయకులు