
సమన్వయంతో ఉత్తమ సేవలు అందించాలి
జిల్లా ఎస్పీ కృష్ణారావు జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం
నరసరావుపేట రూరల్: పోలీస్ సిబ్బంది సమన్వయంతో ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు పేర్కొన్నారు. సెప్టెంబర్ నెల నేర సమీక్ష సమావేశం శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు సత్వర, నాణ్యమైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి ఎస్పీ కృష్ణారావు దిశానిర్దేశం చేశారు. పోలీసు సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలీస్‌స్టేషన్ రిసెప్షన్‌లో నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించి ఫిర్యాదుతో వచ్చే ప్రజలతో మర్యాదతో వ్యవహరించి బాధ్యతతో పరిష్కరించాలని పేర్కొన్నారు. పీజీఆర్‌ఎస్‌లో అందిన ఫిర్యాదులను సమయానుకూలంగా, నాణ్యమైన రీతిలో పరిష్కరించాలన్నారు. మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, అవసరమైతే వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని తెలిపారు. 60, 90రోజుల్లో దర్యాప్తు పూర్తిచేయాల్సిన కేసులను వేగంగా పూర్తిచేసి, న్యాయస్థానంలో ప్రాథమిక చార్జిషీట్ సమర్పించాలని స్పష్టంచేశారు. మహిళా పోలీసుల సహకారంతో శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రాత్రి గస్తీ వ్యవస్ధను పటిష్టం చేయాలని ఆదేశించారు. డ్రంక్‌అండ్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌తోపాటు బహిరంగ ప్రాంతాల్లో మద్యం సేవించి వారిపై కేసులు నమోదు చేయాలని తెలిపారు. సమస్యాత్మక గ్రామాల్లో పల్లె నిద్ర, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బాణసంచా విక్రయ దుకాణాలను పరిశీలించి అనుమతి లేని విక్రయదారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, అదనపు ఎస్పీ(క్రైమ్) లక్ష్మీపతి, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.