
ప్రాచీన వారసత్వ సంపదను పరిరక్షిద్దాం
అమరావతి: కేంద్ర ప్రభుత్వ సహాయసహకారాలతో దేశవ్యాప్తంగా ఉన్న వారసత్వ సంపద పరిరక్షించే బాధ్యత భారతీయులందరిది అని ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ చైర్మన్ అశోక్ సింగ్ ఠాగూర్ అన్నారు. ఆయన ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ సంస్థ సభ్యులతో కలసి శనివారం అమరావతిని సందర్శించారు. ఠాగూర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చారిత్రక ప్రాచీన వారసత్వ కట్టడాలను పరిరక్షించటానికి ప్రస్తుతం 241 ఇంటాక్ చాప్టర్లు పనిచేస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చారిత్రక ప్రాచీన వారసత్వ సంపదను గుర్తించటానికి రాష్ట్రంలోని సంస్థ సభ్యులు పనిచేయాలన్నారు. లండన్ మ్యూజియంలో ఉన్న అమరావతి శిల్పాలను అమరావతి మ్యూజియంలో ఉంచాలన్నారు. అందుకోసం ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. అమరావతి శిల్పాలలో ప్రాచీన నాగరికతలు, అనాటి చారిత్రక పరిస్థితులు ప్రతిబింబిస్తున్నాయన్నారు. అమరావతి అర్కియాలజీ మ్యూజియం, అమరావతి స్థూపం, ధ్యానబుద్ధ, అమరేశ్వరాలయంలను సందర్శించారు. ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ శివనాగిరెడ్డి, ఇంటాక్ చాప్టర్స్ డివిజన్ డైరెక్టర్ కెప్టెన్ అరవింద్ శుక్లా, ఇంటాక్ ఉమ్మడి గుంటూరు జిల్లా కన్వీనర్ ఎస్ వి ఎస్ లక్ష్మీనారాయణ, కో కన్వీనర్ రవి శ్రీనివాస్, అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, మేకల రవీంద్రబాబు, పురావస్తు శాఖ అధికారి సూర్యప్రకాష్, ఇంటాక్ సభ్యులు వేణుగోపాల్, విజయ్ కుమార్, శ్రీధర్ బాబు, యల్లాప్రగడ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ చైర్మన్ అశోక్ సింగ్ ఠాగూర్