
కార్యాలయం దాటని పాస్‌పుస్తకాలు
అన్నదాతలకు తప్పని ఎదురు చూపులు రెండు నెలలుగా కార్యాలయాల్లోనే పుస్తకాలు రుణాలు, ఎరువుల కోసం రైతులకు తప్పని అగచాట్లు
పెదకూరపాడు: పెదకూరపాడు నియోజకవర్గానికి చేందిన రైతు సుబ్బారావు ఇటీవల రైతు సేవా కేంద్రానికి ఎరువుల కోసం వెళ్లారు. ఆయనకు రీసర్వే జరిగిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. కానీ పట్టాదారు పాస్ పుస్తకం ఉంటేనే యారియా ఇస్తామని సిబ్బంది చెప్పారు. దీంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు. ప్రస్తుతం రైతులకు పంట రుణాలు ఎంతో అవసరం. బ్యాంక్‌కు వెళ్లితే పాస్‌పుస్తకాలు లేకపోవడంతో రుణాలు ఇవ్వలేదు. తహసీల్దార్ కార్యాలయాలకు ఈ పుస్తకాలు వచ్చి రెండు నెలలు గడిచినా గడప మాత్రం దాటలేదు. ఉన్నతాధికారులు ఆదేశిస్తే ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ చేస్తారని రెవెన్యూ సిబ్బంది అంటున్నారు. ఆగస్టు 15వ తేదీన పంపిణీ చేస్తారని చెబుతుండటంతో రైతులకు అవస్థలు తప్పడం లేదు.
97,027 పుస్తకాలు ఇవ్వాలి...
పల్నాడు జిల్లాలో మొత్తం 97,037 కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు రాజముద్రతో తహసీల్దార్ కార్యాలయాలకు చేరాయి. నర్సరావుపేట రెవెన్యూ డివిజన్‌లోని 10 మండలాల్లో 83,201, సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్‌లోని 4 మండలాల్లో 9,465, గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని 6 మండలాల్లో 4,361 పాస్‌పుస్తకాలు రైతులకు అందాల్సి ఉంది.
అన్నింటికీ కీలకం...
రుణమాఫీ, రైతు బంధు, అన్నదాతా సుఖీభవ, పంట రుణాలు, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, రైతు బీమా, విత్తనాలు, ఎరువుల రాయితీలు, యంత్ర పరికరాలు, పాడిపశువులు, ఉద్యాన పంటలకు ఉపయోగించే సామగ్రిపై రాయితీకి పట్టాదారు పాస్ పుస్తకమే ప్రామాణికం. రిజిస్టేషన్ పక్రియ ముగిసిన తర్వాత పుస్తకాలు రాకపోవడంతో ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన పథకాల కింద లబ్ధిని రైతులు కోల్పోవాల్సి వచ్చింది. సకాలంలో పుస్తకాలు పంపినీ చేయకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.