
నియోజకవర్గం వేదికగా జూలకంటి కక్ష సాధింపులు
20 గ్రామాలకు చెందిన సుమారు 570 కుటుంబాలు ఊళ్లు వదలివెళ్లాయి సీఎం చంద్రబాబు రాకతో అయినా వారికి స్వేచ్ఛ వస్తుందని ఆశించాం.. ఇప్పుడైనా వారికి స్వేచ్ఛగా బతికే అవకాశం కల్పించాలి మాచర్లలో పేదలకు రేషన్ బియ్యం దొరక్కుండా చేస్తున్నారు వరికపూడిశెల ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేకపోయారు వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
దోచుకోవడం.. దాచుకోవడమే..
సాక్షి, నరసరావుపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి మాచర్లలో అరాచకం రాజ్యమేలుతోందని, ప్రజలకు స్వేచ్ఛగా బతికే అవకాశం లేకుండా పోయిందని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత అభివృద్ధి, సంక్షేమాలను పక్కనపెట్టి తన కక్షసాధింపు చర్యలకు మాచర్లను వేదిక చేసుకున్నాడన్నారు. ఎన్నికల ఫలితాల తరువాత నియోజకవర్గంలోని 20 గ్రామాలకు చెందిన సుమారు 570 కుటుంబాలు ఊరు వదలి ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నాయన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు రాకతో అయినా వారికి స్వేచ్ఛ వస్తుందని భావించానన్నారు. మాచర్లలో అప్రజాస్వామిక పోకడలపై అధికారులు సీఎంకు నివేదిక ఇచ్చి ఉంటారని, దానిపై స్పందించి ఆ 570 కుటుంబాలు తిరిగి గ్రామాలకు వచ్చేలా చేస్తారని ఆశిస్తున్నానన్నారు. వెళ్లిపోయిన వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాలు ఉన్నాయని, వారికి స్వేచ్ఛగా బతికే అవకాశాలు కల్పించాలన్నారు.
వరికపూడిశెలపై ఒక్క ప్రకటనైనా లేదు
పల్నాడు ప్రజల చిరకాల కోరికై నా వరికపూడిశెల ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులను గత ప్రభుత్వంలో, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చారన్నారు. ఎంతో కీలకమైన పర్యావరణ, వన్యప్రాణ అనుమతులను కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరీ తీసుకువచ్చారన్నారు. మొదటి దశ పనులను ప్రారంభించామని, అయితే ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయన్నా రు. కూటమి ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రాజెక్టు పనులకు అవసరమైన నిధులను కేటాయించలేదన్నారు. సీఎం చంద్రబాబు పర్యటనలోనైనా ప్రాజెక్టు పనులకు అవసరమైన నిధులను విడుదల చేసి, పనులు ఎప్పటికి పూర్తి చేస్తారో చెబుతారని ఈ ప్రాంత ప్రజలు ఆశించారన్నారు. అయితే సీఎం ఆ దిశగా ప్రకటన చేయకపోవడం బాధాకరమన్నారు. 15 ఏళ్లకు పైగా సీఎంగా ఉన్న చంద్రబాబు వచ్చిన ప్రతిసారి ప్రకటనలు, శంకుస్థాపనలకే పరిమితమవుతున్నారన్నారు. చిత్తశుద్ధి ఉంటే నిధులు విడుదల చేసి, పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. వరికపూడిశెల పూర్తి చేసే సత్తా ఒక్క వైఎస్ జగన్‌కి మాత్రమే ఉందన్నారు.
పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యాన్ని మాచర్లలో కూటమి నేతలు అక్రమ రవాణా చేసి రూ.కోట్లు సంపాదిస్తున్నారన్నారు. బడుగు బలహీనవర్గాలకు తినడానికి ఒక్క కిలో రేషన్ బియ్యం కూడా ఇవ్వడం లేదన్నారు. మాచర్లలో జరుగుతున్న దుర్మార్గాలను సీఎం దృష్టికి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ స్థానిక నేతలు శనివారం ప్రయత్నించినా అవకాశం దక్కకపోవడంతో నిరుత్సాహంలో ఉన్నారన్నారు. జూలకంటి అప్రజాస్వామిక పోకడలపై తెలుగుదేశం పార్టీ క్యాడరే రోడ్డుపై వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. అక్రమ కేసులు, పీడీ యాక్టులు పెట్టడం, ప్రజలను దోచుకోవడం తప్ప బ్రహ్మారెడ్డి మాచర్లకు చేసిందేమి లేదన్నారు.