
డయేరియా కేసులు @100
తగ్గుముఖం పట్టని వ్యాధి కలుషిత నీరు కాదంటూ కమిషనర్ ప్రకటన నీటి వల్లే అంటున్న వైద్యులు
సాక్షి ప్రతినిధి, గుంటూరు : గుంటూరులో డయేరియా కేసులు సెంచరీకి చేరువలో ఉన్నాయి. తగ్గుముఖం పట్టకపోగా రోజ రోజుకీ పెరుగుతుండటంతో ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తోంది. శనివారం ఉదయానికి జీజీహెచ్‌లో బాధితుల సంఖ్య 92కు చేరింది. సమస్య పరిష్కారానికి కృషి చేయకుండా అధికారులు పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారు. కలుషిత నీరు కాదు, కలుషిత ఆహారం వల్లే సమస్య ఏర్పడిందంటూ కమిషనర్ డయేరియా వెలుగు చూసిన రోజే ప్రకటన చేయడం వివాదాస్పదంగా మారింది. జీజీహెచ్ వైద్యులు మాత్రం కలుషిత నీటి వల్లే ఈ సమస్య ఏర్పడిందని స్పష్టంగా చెబుతున్నారు.
బాధితులు సంఖ్య బయటపెట్టని అధికారులు
జీజీహెచ్‌కి వచ్చిన కేసులను కూడా పూర్తిగా బయటపెట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు ప్రైవేటు ఆసుపత్రులకు, ఆర్‌ఎంపీల వద్దకు వెళుతున్న వారు, ఇంటి వద్దనే వైద్యం తీసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయాలను వెల్లడించకుండా కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా జీజీహెచ్‌ను అకస్మికంగా తనిఖీ చేశారు. అతిసార, ఇతర బాధితులను పరామర్శించారు. వైద్య సిబ్బంది సందర్శనలు, స్థానికుల తాగు నీటి వసతులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వైద్యాధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
నగర ప్రజల్లో ఆందోళన
2018లో ఆనందపేటతో పాటు పలు ప్రాంతాల్లో ఇదే విధంగా డయోరియాతో 30 మంది వరకూ మరణించడంతో నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు నగరంలోని 57 డివిజన్లలో పలు ప్రాంతాల్లో ఇంటింటికీ సరఫరా అయ్యే తాగునీటి పైపులైన్లు మురుగు కాలువల్లోనే దర్శనమిస్తున్నాయి. మరికొన్ని మురుగు కాలువను అనుకొని వెళుతున్నాయి. వర్షం కురిస్తే చాలు పొంగి వాటర్ పైపులైన్లన్నీ కూడా మునిగిపోతున్నాయి. పైపుల్లోకి మురుగు నీరు చేరుతుందని నగరంలోని రామిరెడ్డితోట, ఆనందపేట, దుర్గానగర్, యానాదికాలనీ, తదితర ప్రాంతవాసులు చెబుతున్నారు.