
జీజీహెచ్ కిటకిట
గుంటూరు మెడికల్: గుంటూరు నగరంలో డయేరియా కోరలు సాచింది. రోజురోజుకు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. బుధవారానికి 30 మందికి పైగా చికిత్స పొందారు. గురువారానికి ఈ సంఖ్య 60కు చేరుకుంది. బాధితుల వివరాలను ఆసుపత్రి అధికారులు గోప్యంగా ఉంచుతున్నా రు. కేసుల సంఖ్య ఎక్కువే ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రత్యేక వార్డులో సైలెన్ స్టాండ్లు కరువు
డయేరియా బాధితుల కోసం ఆసుపత్రిలో జనరల్ సర్జరీ విభాగంలో 333వ నంబరు గదిని కేటాయించారు. అయితే, రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా దానికి తగ్గట్టుగా వార్డులో సౌకర్యాలు పెంపొందించలేదన్న విమర్శలు ఉన్నాయి. సైలెన్ స్టాండ్‌లు లేకపోవడంతో మంచాలకు, గోడలకు బాటిళ్లు వేలాడదీస్తున్నారు. గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇతర పార్టీల నేతలు రోగులను పరామర్శించారు. ఈ సమయంలో మంచాలకు, గోడలకు ౖసైలెన్ బాటిళ్లు వేలాడదీసిన దృశ్యాలు కనిపించడంతో ప్రజాప్రతినిధులు సైతం నిలదీశారు.
లిఫ్టులు పనిచేయక అవస్థలు
ఇన్ పేషెంట్ విభాగంలో లిఫ్టులు పనిచేయడం లేదు. బాధితులు చికిత్స పొందే వార్డుకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజూ సాధారణ రోగులు సైతం ఇన్‌పేషెంట్ విభాగంలో అడ్మిట్ అయి, చికిత్స పొందేందుకు లిఫ్టులు పనిచేయక యాతనపడుతున్నారు. మూడు రోజులుగా డయేరియా బాధితులు వస్తున్నా మరమ్మతులు చేయించకుండా ఆసుపత్రి అధికారులు మిన్నకుండి పోవడంతో రోగుల బాధలు వర్ణనాతీతంగా మారాయి.
డీఎంహెచ్‌ఓ పరామర్శ
గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రోగులను డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి గురువారం పరామర్శించారు. ఏఏ ప్రాంతాల నుంచి వచ్చారు.. ఆరోగ్యం ఎలా ఉందంటూ ప్రశ్నించారు. చికిత్స పొంది డిశ్చార్జి అయిన ఐదుగురి నివాసాలకు ఆరోగ్య సిబ్బందిని పంపించారు. నీరసంగా ఉన్న వారికి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందజేసి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ వార్డులో చికిత్స పొందుతున్న బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వార్డులో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన ఆదేశించారు.