
సమస్యలపై ఉద్యమించాల్సిన సమయం
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు విద్యారంగ సమస్యలపై యూటీఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి
చిలకలూరిపేట: రాష్ట్రంలో సమస్యలపై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా ఏ సమస్యకు చెప్పకోదగ్గ పరిష్కారం లభించలేదని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 19 వరకు చేపట్టిన రణభేరి కార్యక్రమం గురువారం శారదా జెడ్పీ హైస్కూల్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యారంగంలో సమస్యలు పరిష్కరించక పోగా, ఉపాధ్యాయులను సమాజంలో దోషులుగా చిత్రీకరించే పని జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యకు పరిష్కారం చూపకుండా ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలహీన పరుస్తోందని అన్నారు. విద్యా హక్కు చట్టం, ప్రపంచబ్యాంక్ సాల్ట్ పథకం అమలు పేరుతో మూడో వంతు ప్రైమరీ స్కూళ్లు ఇప్పటికే సింగిల్ టీచర్ స్కూళ్లు మారిపోయాయని అన్నారు. హైస్కూళ్లలో పనిచేసే స్కూల్ అసిస్టెంట్లు సర్‌ప్లస్ పేరుతో క్లస్టర్ టీచర్లుగా, ప్రైమరీ స్కూల్ హెడ్‌మాస్టర్లుగా పనిచేయాల్సిన పరిస్థితులు కల్పించారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రణభేరి కార్యక్రమం చేపట్టి ఈనెల 25న విజయవాడలో వేలాదిమందితో బహిరంగ సభ నిర్వహించి సమస్యల పరిష్కారానికి రణభేరి మోగిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం మోహనరావు, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ టీఎస్‌ఎన్ మల్లేశ్వరరావు, ప్రచురణ కమిటీ చైర్మన్ ఎం హనుమంతరావు, నాయకులు షేక్ ఖాశింపీరా, జేవీడీ నాయక్, ఎ భాగేశ్వరీదేవి, బి రవిబాబు, కె తిరుపతిస్వామి, ఎ శ్రీనివాసరావు, నాసరారెడ్డి, ఎస్‌కెఎండీ యాసిన్ తదితరులు పాల్గొన్నారు.