
ఆంక్షలు.. సిఫార్సులు
పిడుగురాళ్ల: సాగు సంగతి దెవుడెరుగు..యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఎండను, వర్షాన్ని లెక్క చేయక పడిగాపులు పడుతున్నారు. తీరా అధికారులు ఆధార్ కార్డు జిరాక్స్, పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ కావాల్సిందే అని ఆంక్షలు. అవి తీసుకువస్తే ఐదెకరాలు ఉన్న వారికి రెండు కట్టలే ఇస్తామని..అన్నీ ఓకే అయితే అధికార పార్టీ నాయకుల సిఫార్సు ఉండాలంటూ వ్యవసాయశాఖ అధికారులు మెలిక పెడుతున్నారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 20 రోజుల తర్వాత పిడుగురాళ్ల పట్టణంలోని మార్కెట్ యార్డులోని సహకార సంఘానికి యూరియా స్టాకు వచ్చింది. సమాచారం తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అధికార పార్టీ నేతలు తమ రైతులకు ఇవ్వాలంటూ అధికారులపై ఒత్తిడి చేశారు. దీంతో ప్రథమ ప్రాధాన్యత అధికార పార్టీ నేతలు సూచించిన రైతులకే యూరియా ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీంతో కొంత మంది రైతులకు మాత్రమే యూరియా అందింది. మరికొంత మంది రైతులకు యూరియా అందకపోవటంతో గత్యంతర లేక వెనుదిరిగి వెళ్లారు. అధికార పార్టీ నాయకుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా పంపిణీ రాజకీయాలు చేయడం తగదని పేర్కొన్నారు.