
జీవన నైపుణ్యాలపై విద్యార్థులకు శిక్షణ
విజయపురి సౌత్: స్థానిక ఏపీఆర్ డిగ్రీ కళాశాలలో ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ ఆధ్వర్యంలో జీవన నైపుణ్యాలపై రెండు రోజుల పాటు విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. దీనిలో భాగంగా ఏపీఎస్‌సీఆర్‌టీ కరికులం కమిటీ మెంబర్ డాక్టర్ సీఏ ప్రసాద్ మాట్లాడుతూ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే పరిస్థితుల్లో స్థిరంగా ఉండాలని తెలిపారు. కళాశాలలోని గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సాహిత్యాభిలాషులుగా ఉంటూ సమాజ హితానికి పాటుపడాలని చెప్పారు. స్ఫూర్తివంతమైన కథలతో విద్యార్థులకు సూచనలు అందించారు. రెండవ రోజు బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయుడు కె. ప్రభాకర్ మాట్లాడారు. అంబేడ్కర్ ఆశయాలైన సమానత్వం, సౌభ్రాతృత్వం కలిగి ఉండాలని ఉన్నత విద్యావంతులుగా తయారవ్వాలని తెలిపారు. చదువొక్కటే జీవితాలను మార్చగలదని చెప్పారు. తెలంగాణ జన విజ్ఞాన వేదిక స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కె. కొండల రెడ్డి విద్యార్థులకు ప్రత్యక్షంగా కొన్ని ప్రయోగాలను చూపించి సైన్స్‌పై అవగాహన కల్పించారు. కాళోజీ కవితను వినిపించి, ఆయన సాహిత్యాన్ని చదవాలని విద్యార్థులకు కిరణ్మయి సూచించారు. అందరితో రాజ్యాంగ పీఠికను పాండురంగారావు (మట్టి ప్రచురణలు) చదివించారు. కార్యక్రమం ప్రిన్సిపాల్ నయీం భాను పర్యవేక్షణలో జరిగింది. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు..