
చేనేత రంగానికి రూ 1000 కోట్లు కేటాయించాలి
మంగళగిరి: రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి రూ.1000 కోట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని రత్నాలచెరువులోని సింహాద్రి శివారెడ్డి భవనంలో చేనేత కార్మిక సంఘం 9వ పట్టణ మహాసభ జంజనం శివ భవన్నారాయణ అధ్యక్షతన నిర్వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూ పాలకులు అవలంభిస్తున్న కార్పొరేట్ విధానాల వలన చేనేత పరిశ్రమ సంక్షేభంలో కూరుకుపోయిందన్నారు. నమ్ముకున్న వృత్తిని వదులుకోలేక మరో వృత్తిలోకి వెళ్లలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులలో చేనేత కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేనేత పరిశ్రమపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేయాలని, 20 శాతం రిబేట్ సంవత్సరం కొనసాగించాలన్నారు. వైఎస్సార్ నేతన్న నేస్తం మగ్గం నేస్తున్న ప్రతి చేనేత కార్మికుడికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బోగస్ చేనేత సహకార సంఘాలను రద్దు చేసి, పనిచేస్తున్న సంఘాలను ప్రోత్సహించాలని కోరారు. మహాసభలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈమని అప్పారావు, సీఐటీయూ నాయకుడు ఎస్‌ఎస్ చెంగయ్య పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటిని ఎన్నుకున్నారు. పట్టణ నూతన అధ్యక్షుడుగా డోకుపర్తి రామారావు, ఉపాధ్యక్షుడిగా గోలి దుర్గాప్రసాద్, కార్యదర్శిగా సాదు నరసింహారావు, సహాయ కార్యదర్శిగా ఎం శివచంద్రరావు, కమిటీ సభ్యులుగా జె చంద్రమౌలి, కే కుమారి, కె.మల్లికార్జునరావు, జె శివభవన్నారాయణ, వై నాగు, జే రవి, టి హేమసుందరరావులు ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి.బాలకృష్ణ