
ప్రభుత్వం మధ్యంతర భృతి ప్రకటించాలి
ఎస్టీయూ డిమాండ్
చిలకలూరిపేట: దసరా పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 30 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటించాలని ఎస్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. చిలకలూరిపేటలోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె కోటేశ్వరరావు, డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై ముఖ్యమంత్రి వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, ఉపాధ్యాయులపై యాప్‌ల భారాన్ని తగ్గించి, బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మూల్యాంకన పుస్తకాలు విద్యార్థులు, ఉపాధ్యాయులకు భారంగా మారాయని, వాటిని పునఃపరిశీలించి, వెంటనే మున్సిపల్ ఉపాధ్యాయులకు ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను ప్రారంభించాలని కోరారు. 12వ పీఆర్సీ అమలు ఆలస్యం అవుతున్నందున, ఉద్యోగుల ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని మధ్యంతర భృతి ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వినుకొండ అక్కయ్య, మేకల కోటేశ్వరరావు, షేక్ మక్బూల్‌బాషా, దుర్గాప్రసాద్, బొంత రవి, జి కోటేశ్వరరావు సభ్యులు పాల్గొన్నారు.