
రైతులకు మేలు చేసేలా జీఎస్టీలో మార్పుల్లేవు
నగరంపాలెం: రైతులకు మేలు చేసేలా జీఎస్టీలో మార్పుల్లేవని ది ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) శాశ్వత గౌరవాధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు అన్నారు. జిన్నాటవర్ కూడలిలోని ఐసీసీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ యువత, కార్మికులకు కూడా జీఎస్టీలో శ్లాబుల మార్పు ఉపయోగపడేలా లేదన్నారు. పెట్రోల్, డీజిల్‌పై జీఎస్టీ తగ్గించాలని అన్నారు. ఆటోలు, ఫెర్టిలైజర్‌పై కూడా ఇదే నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. మహిళలకు సంబంధించి కాస్మోటిక్స్, దుస్తులు, నగలపై పన్నులు విధించరాదని పేర్కొన్నారు. కొన్ని చోట్ల రివర్స్ ట్యాక్స్‌లు విధిస్తున్నారని, అది సరైందికాదని చెప్పారు. ఒకట్రెండు రోజులుగా కిరాణా వస్తువుల దుకాణాల ఎదుట స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలనే బోర్డులు ఏర్పాటు మంచిదని అన్నారు. మిగతా వ్యాపారస్తులు కూడా ప్రయత్నించాలని చెప్పారు. భారీ మాల్స్‌కు అనుమతి ఇవ్వవద్దని అన్నారు. పట్టణాల్లో నెలకొల్పినా మున్సిపల్, పంచాయతీల పరిధిలో వద్దని కోరారు.