
● ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ● ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
ఉత్తమ పౌరులను అందించే బాధ్యత ఉపాధ్యాయులదే
నరసరావుపేట ఈస్ట్: సమాజానికి ఉత్తమ పౌరులను అందించే బాధ్యత గురువులపైన ఉందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రకాష్‌నగర్‌లోని టౌన్‌హాల్‌లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీ శ్రీకృష్ణదేవ రాయలు మాట్లాడుతూ మారుతున్న విద్యా వ్యవస్థకు అనుగుణంగా ఉపాధ్యాయులు బోధనలో నైపుణ్యాలను పెంచుకోవాలని అన్నారు. విద్యార్థులలో పరిశీలనాత్మక, పరిశోధనాత్మక ఆలోచనలు పెంపొందించేలా గుణాత్మక విద్యను అందించాలని సూచించారు. విద్యారంగానికి అవసరమైన అన్ని మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు.
ప్రతి విద్యార్థిపై శ్రద్ధ అవసరం
జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు మాట్లాడుతూ విద్యార్థి జీవితాన్ని పాఠశాల స్థాయి ఉపాధ్యాయుడు ప్రభావితం చేస్తారని తెలిపారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కనీసం పదాలు రాయలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నో వసతులను కల్పిస్తున్నప్పటికీ విద్యార్థులు ఎందుకు వెనుకబడి ఉంటున్నారని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించి వారి అభ్యున్నతికి కృషి చేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఎస్‌ఎస్ అండ్ ఎన్ కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు కె.విజయ కుమార్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించి ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు పొందిన వారిని సత్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.