
తురకపాలెంలో వరుస మరణాలపై పరిశీలన
గుంటూరు రూరల్: మండలంలోని తురకపాలెంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం పర్యటించారు. గ్రామంలో బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హెల్త్ క్యాంప్‌ను పరిశీలించారు. వైద్య సిబ్బందిని అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ బర్కోల్డేరియా సూడోమలై అనే బ్యాక్టీరియా వల్ల జ్వరాలు వచ్చి కొందరు మరణించారని చెప్పారు. మెలియాయిడోసిస్ అనేది చాలా అరుదైన వ్యాధి అని, దాని వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారికి ఇబ్బందులు వస్తాయని వివరించారు. యాంటీబయాటిక్ ద్వారా జబ్బు తగ్గించవచ్చని చెప్పారు. నాలుగైదు రకాలు మాత్రమే పనిచేస్తాయని తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు పరిహారం విషయం ఆలోచిస్తున్నామని తెలిపారు. కేవలం తాగు నీటి ద్వారా బ్యాక్టీరియా వ్యాపించదని, గాలి, నీరు, మట్టి తేమ స్థాయి ఎక్కువగా ఉంటే వ్యాపిస్తుందని వివరించారు. అరుదైన వ్యాధి కాబట్టే గుర్తించడంలో ఆలస్యం జరిగిందని, పరీక్షల ఫలితాలు రావడానికి ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడారు.