
యూరియా అక్రమ తరలింపు కేసులో ఇద్దరికి రిమాండ్
–జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు
నరసరావుపేట: యూరియా అక్రమాలపై జిల్లా అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తోందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు గురువారం వెల్లడించారు. పొందుగల చెక్‌పోస్టు వద్ద నిబంధనలకు విరుద్ధంగా యూరియాను తెలంగాణకు తరలిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా, వారికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిందని తెలిపారు. ఈ నెల 2వ తేదీన పొందుగల చెక్‌పోస్టు వద్ద మండల స్థాయి బృందం ఆకస్మిక తనిఖీలో 630 కేజీల యూరియాను తెలంగాణకు అక్రమంగా తరలిస్తూ నల్గొండ జిల్లా వాసులు పులి పిచ్చయ్య, బుక్యా రవి పట్టుబడ్డారన్నారు. ఎరువుల రవాణాకు వినియోగించిన వాహనాన్ని సీజ్ చేశామని తెలిపారు. వ్యక్తిగత వాహనాలను ఇతరులు ఎరువుల రవాణాకు వినియోగించకుండా జాగ్రత్త పడాలని పౌరులకు సూచించారు.
చినగంజాం: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా చినగంజాం మండలానికి చెందిన ఇరువురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. రాజుబంగారుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిషు స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రావిపాటి శివ వెంకట పోతురాజు, ఆవులదొడ్డి గొల్లపాలెంలోని పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న కడలి సుజాతలు ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.
కోడూరు: స్వామిజీల వేషధారణలో భిక్షాటనకు వచ్చిన నలుగురు వ్యక్తులు ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. వారిని కోడూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఎస్‌ఐ చాణక్య కథనం మేరకు.. మండలంలోని లింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన బచ్చు వెంకట పున్నయ్య ఇంటికి నలుగురు వ్యక్తులు గురువారం స్వామిజీల వేషధారణ భిక్షాటనకు వచ్చారు. పున్నయ్య వరండాలో టేబుల్‌పై రూ.11 వేలు ఉంచి ఇంట్లోకి వెళ్లాడు. అదే సమయంలో భిక్షాటనకు వచ్చిన నలుగురు దొంగ స్వాములు ఆ నగదును దొంగిలించి పరారయ్యారు. నగదు పోయిన విషయాన్ని గ్రహించిన పున్నయ్య వెంటనే కోడూరు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా బాపట్ల జిల్లా నగరం గ్రామానికి చెందిన గంధం శివయ్య, గంధం తోట స్వామిజీ, పాసం బాజీ, పాసం యేసును నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు.
రేపల్లె: రేపల్లె ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలో అతిథి అధ్యాపకుల నియమకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ టీసీ రవిచంద్ర కుమా ర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కామ ర్స్, జంతుశాస్త్రం, కంప్యూటరు సైన్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. సంబంధిత సబ్జెక్టు పీజీలో 55 శాతం మార్కులు కలిగి ఉన్న వారు దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉండాలన్నారు. నెట్, సెట్, పీహెచ్‌డీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 10వ తేదీన ఉదయం 11 గంటలకు ఒరిజినల్ సర్టిఫికేట్‌లతో కళాశాలలో జరిగే ఇంటర్వ్యూకి హాజరు కావాలన్నారు.
భట్టిప్రోలు(వేమూరు): కరెంట్ షాక్ వల్ల యువ కౌలు రైతు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. భట్టిప్రోలు మండలంలోని గుత్తావారి పాలెం గ్రామానికి చెందిన వాకా శరత్(26) గురువారం ఉదయం పొలంలో నీరు పెట్టేందుకు కరెంట్ మోటారు వేశాడు. కొద్దిసేపు తర్వాత ఇనుప గొట్టంపై చెయ్యి పెట్టి మంచినీళ్లు తాగుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టడంతో పెద్దగా కేక వేసి కింద పడిపోయాడు. పక్క పొలంలో పని చేస్తున్న రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో, వారు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేయగా మృతి చెందాడని తెలిపారు.