నరసరావుపేట రూరల్: వ్యాపారం పేరుతో ఎన్‌ఆర్‌ఐకు టోకరా, కుమారులను విదేశాలకు పంపేందుకు ఆర్థిక సహకారం అందించిన సోదరుడికి నగదు చెల్లించకుండా చేస్తున్న వేధింపులపై జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు ఫిర్యాదులు అందాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాయలంలో సోమవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, ఆర్థిక, ఆస్తి, మోసం తదితర సమస్యలపై 65 ఫిర్యాదులు అందాయి.
సోదరుడు మోసం
ముప్పాళ్ల మండలం తురకపాలేనికి చెందిన దాసరి జోసఫ్ తంబికుమార్ నాల్గవ సోదరుడు అంతయ్య నరసరావుపేట రెడ్డినగర్‌లో నివసిస్తున్నారు.
అంతయ్య కుమారులు జర్మనీలో చదువుల నిమిత్తం రూ.33.50లక్షలను 2019 నుంచి పలు దఫాలుగా తంబికుమార్ అందించారు. పిల్లలు చదువులు పూర్తిచేసి స్థిరపడినప్పటికీ నగదు చెల్లించడంలేదు. పలుమార్లు అడగటంతో అంతయ్య ప్రోనోట్లు రాసిఇచ్చాడు. వాటి కాలం తీరిపోవడంతో తిరిగి రాయమని అడగ్గా మభ్యపెడుతూ మోసగిస్తూ వస్తున్నాడు. దీనిపై న్యాయం చేయాలని ఎస్పీని తంబికుమార్ కోరాడు.
మోసం వలలో ఎన్‌ఆర్‌ఐ
నరసరావుపేటలో వీసా కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న తాడువాయి వెంకటేశ్వరరావు సోదరుడు అశోక్‌బాబు అమెరికాలో జీవిస్తున్నాడు. వీరిద్దరికి కామన్ స్నేహితుడైన పెరుమాళ్ల సాయి జస్వంత్ తాను విజయవాడలో కొనుగోలు చేసిన ప్లాట్‌కు చెల్లించేందుకు రూ.52లక్షలను 2024లో అశోక్‌బాబు నుంచి అప్పుగా తీసుకున్నాడు.స్నేహితుడైన తక్కిళ్లపాటి అఖిలేష్‌తో కలిసి మార్బుల్ వ్యాపారం చేద్దామని అశోక్‌బాబును నమ్మించి సాయిజస్వంత్ రూ. 51.40లక్షలు తమ అకౌంట్లకు బదిలీ చేయించుకున్నారు. ఇప్పటి వరకు వ్యాపారం మొదలు పెట్టకపోవడంతో మోసపోయానని గ్రహించి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.
ఆస్తి కోసం హత్యాయత్నం
రొంపిచర్ల మండలం తుంగపాడు గ్రామానికి చెందిన తుర్లపాటి శ్రీనివాసరావుపై గత నెల 8న సోదరుడు, సోదరి తరఫు వ్యక్తులు గొడ్డళ్లు, రాడ్‌లతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో శ్రీనివాసరావు నడవలేని స్థితిలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాడు. తనపై దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయకుండా రొంపిచర్ల పోలీసులు సాధారణ కేసు నమోదు చేయడంపై జిల్లా ఎస్పీకి పిర్యాదు చేశాడు. తనకు చెందిన పంటపొలాన్ని సాగు చేయకుండా అడ్డుకుంటున్నారని తెలిపాడు. రక్షణ కల్పించి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.
వివాహం చేసుకొని మోసం
అచ్చంపేట మండలం కస్తల గ్రామానికి చెందిన పాటిబండ్ల మౌనిక భర్తతో విడిపోయి ఒంటిరిగా ఉంటోంది. గ్రామానిక చెందిన జాన్‌బెన్ని ఆమె ఇంటికి వచ్చి వేధిస్తుడటంతో పెద్ద మనుషుల మధ్య పంచాయతీ నడిచింది. తరువాత మౌనికను నమ్మించి అమరావతిలో గత నెల 15వ తేదీ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత నుంచి వేధిస్తుడంతో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది.
నమ్మించి రూ.కోటికి పైగా మోసం
పీజీఆర్‌ఎస్‌లో జిల్లా ఎస్పీ
కె.శ్రీనివాసరావుకు ఫిర్యాదు
పలు సమస్యలపై 65 అర్జీల స్వీకరణ
వ్యాపారం పేరుతో ఎన్‌ఆర్‌ఐకు టోకరా