
చిన్నారుల తిండిపైనా చిన్నచూపే!
నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అంగన్‌వాడీ కేంద్రాలను చిన్నచూపు చూస్తోంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఇచ్చే పౌష్టికాహారం పంపిణీలో కాంట్రాక్టర్లు చేతి వాటం చూపుతున్నారు. నాసిరకం ఆహారం, సరుకులు సరఫరా చేస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. గుంటూరు అర్బన్ పరిధిలో కుళ్లిపోయిన కోడిగుడ్లు, పాడైపోయిన కందిపప్పు చూసి లబ్ధిదారులు షాకయ్యారు. దీన్ని పౌష్టికాహారం అంటారా అని మండిపడుతున్నారు.
అంతా నాసిరకం
జిల్లాలో 1,480 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. 6 నెలల నుంచి మూడేళ్లలోపు వయస్సున్న చిన్నారులు 49,976 మంది కాగా.. 3 – 6 సంవత్సరాలలోపు వారు 14,771, గర్భిణులు 9,148, బాలింతలు 7,009 మంది ఉన్నారు. కాంట్రాక్టర్లు కక్కుర్తితో నాసిరకం ఆహారం పంపిణీ చేస్తూ జేబులు నింపుకొంటున్నారు. ముడుపులు తీసుకుని అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
కూటమి దెబ్బకు కష్టాలు
గత ప్రభుత్వం హయాంలో అందరికీ సక్రమంగా పౌష్టికాహారం అందేది. వీటిలో కోత విధించేందుకు కూటమి ప్రభుత్వం కొత్త నిబంధనలు తెచ్చింది. ఆధార్ వెరిఫికేషన్ (ఈకేవైసీ), ఫేస్ రికగ్నేజేషన్ (ముఖ ఆధారిత ఽధ్రువీకరణ) ఉంటేనే పౌష్టికాహారం అందిస్తున్నారు. ఆధార్‌కు లింక్ చేసిన ఫోను నంబర్లు చాలామందికి అందుబాటులోకి లేక ఓటీపీలు రావడం లేదు. ఆధార్ అప్‌డేట్ చేయించుకోకపోవడం వల్ల ఫేస్ రికగ్నేజేషన్ కాక ఆహారం తీసుకోలేకపోతున్నారు. నాణ్యత లేని పౌష్టికాహారం సరఫరాపై గుంటూరు అర్బన్ సీడీపీఓ అరుణను వివరణ కోరగా... కాంట్రాక్టర్లతో మాట్లాడి మంచి పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కూటమి సర్కారు వచ్చాక అడ్డగోలుగా సరఫరా
కాంట్రాక్టర్ల కక్కుర్తితో నాసిరకం
పౌష్టికాహారం పంపిణీ
కుళ్లిన కోడిగుడ్లు, పాడైపోయిన
కందిపప్పు అందజేత
కొత్త నిబంధనలతో లబ్ధిదారులకు
అందని పౌష్టికాహారం

చిన్నారుల తిండిపైనా చిన్నచూపే!