
12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే నియమించాలి
నరసరావుపేట ఈస్ట్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జూలై 2023 నుంచి అమలు చేయాల్సిన 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే నియమించాలని రాష్ట్రోపాధ్యా సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు జోసఫ్ సుధీర్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఎస్టీయూ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన ఎస్టీయూ పల్నాడు జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమావేశానికి పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఎల్.వి.రామిరెడ్డి అధ్యక్షత వహించారు. ఉపాధ్యాయులకు రావలసిన 11వ పీఆర్‌సీ ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని, పెండింగ్ ఉన్న కరువు భత్యం బకాయిలు విడుదల చేయాలని సుధీర్‌బాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వం యోగా, మెగా పీటీఎం, స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర పేరుతో బోధనేతర కార్యక్రమాలు చేపట్టటం వలన పాఠశాలల్లో బోధనా కార్యక్రమాలు కుంటుపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా శక్తి పేరుతో పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఒత్తిడి చేయడం భావ్యం కాదన్నారు. ఉపాధ్యాయులపై యాప్‌ల భారం తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్‌ఎం సుభాని, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె.గంగాధరబాబు, రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యుడు అనిల్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి యు.చంద్రజిత్ యాదవ్, జిల్లా ఆర్థిక కార్యదర్శి ఏ.ఏమండీ, ఎస్టీయూ గుంటూరు జిల్లా పూర్వ అధ్యక్షుడు గేరా మోహనరావు, కరిముల్లా, ఉపాధ్యాయు వాణి కన్వీనర్ జె.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీయూ డిమాండ్