
ముక్తేశ్వరుని సాక్షిగా ఇసుక అక్రమ తవ్వకాలు
రేపల్లె: దక్షిణకాశీగా పేర్గాంచిన రేపల్లె మండలం మోర్తోటలో పార్వతీ సమేత ముక్తేశ్వరస్వామి ఆలయ సమీపంలో కూటమి నేతల కనుసన్నలలో అక్రమ ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఆలయానికి 300 మీటర్ల దూరంలో కృష్ణమ్మ ఒడ్డున జేసీబీలతో ఇసుకను తవ్వి ట్రాక్టర్‌ల ద్వారా విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రసిద్ధిగాంచిన ముక్తేశ్వరస్వామి ఆలయానికి సాధారణ రోజులతో పాటు కార్తికమాసంలో భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కుబడులు తీర్చుకుని కృష్ణానదిలో పుణ్యస్నానమాచరిస్తుంటారు. కృష్ణానదిలో నీరు తక్కువగా ఉండటంతో ఇదే అదునుగా భావించిన కూటమినేత కన్నుసన్నలలో ఇసుకాసురులు జేసీబీల ద్వారా గుంతలు తవ్వి ఇసుకను తరలిస్తున్నారు.