
ఉపాధి కూలీలకు డబ్బులు వేస్తాం
రాజుపాలెం: ఉపాధి కూలీలకు త్వరలో డబ్బులు వేస్తామని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాలలో జిల్లా కలెక్టర్ విసృతంగా పర్యటించి, కొన్ని కార్యాలయాలలో ఆకస్మికంగా బుధవారం తనిఖీలు నిర్వహించారు. బ్రాహ్మణపల్లిలో గల రైతు గుర్రాల జగన్ పొలంలో ఉపాధి హామీ పథకం ద్వారా తీసిన పంట కుంటలను పరిశీలించారు. అక్కడ వేసి ఉన్న ఉపాధి కూలీలతో మాట్లాడారు. ఉపాధి కూలీలు కలెక్టర్‌తో మాట్లాడుతూ మాకు ఒక్కవారం మాత్రమే కూలి డబ్బులు పడ్డాయి. మిగిలినవి ఇంతవరకు డబ్బులు పడలేదని తెలిపారు. ఉదయం 7 గంటలకు వచ్చి 11 గంటల వరకు పనిచేస్తున్నామని, కూలీ రేటు పెంచాలని కలెక్టర్‌కు వివరించారు. వెంటనే స్పందించిన కలెక్టర్ త్వరలో డబ్బులు వేస్తామని, మీరు అధైర్య పడవద్దని ఉపాధి కూలీలకు హామీ ఇచ్చారు. తొలుత అనుపాలెం జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించి సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం రాజుపాలెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంను సందర్శించారు. సత్తెనపల్లి ఆర్డీఓ రమణాకాంత్‌రెడ్డి, డీఈఓ చంద్రకళ, డ్వామా పీడీ ఎం.సిద్ధలింగమూర్తి, ఏపీడీ పొత్తూరి వెంకట నారాయణ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ పద్మావతి, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ సింగయ్య, తహసీల్దార్ దుర్గేష్‌రావు, ఎంపీడీఓ జీవీ సత్యనారాయణ, ఎంఈఓ 1, మల్లిఖార్జునశర్మ, ఎంఈఓ – 2 నరసింహారావు, విద్యుత్ ఏఈ కోటా పెదమస్తాన్‌రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు