
షరతులపై గుర్రు
సత్తెనపల్లి: పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 10న నిర్వహించనున్న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం–2.0) కార్యక్రమ నిర్వహణపై విద్యా శాఖాధికారులు షరతులు విధించారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభించి మధ్యాహ్నం 12:30 వరకూ జరుగుతుందీ లేనిదీ ఇతర శాఖల ఉద్యోగి పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఆ ఉద్యోగి మెగా పీటీఎం రోజున 30 సెకన్ల వీడియో, నాలుగు ఫొటోలు, మొత్తం సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. ప్రధానోపాధ్యాయులు ఉపయోగిస్తున్న లీప్ యాప్‌లో సాక్షిగా వచ్చిన వ్యక్తి అప్‌లోడ్ చేయాలని ఉపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులు షరతు విధించారు.
గురువులపై అదనపు భారం
జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అన్ని మేనేజ్మెంట్ విద్యాసంస్థల్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పల్నాడు జిల్లాలో 2,038 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 2,70,968 మంది విద్యార్థులు ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నారు. మెగా పీటీఎం కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులను పిలిచి విద్యార్థుల ప్రగతిని వివరించడం, వారికి అక్కడే మధ్యాహ్న భోజనం, క్రీడల నిర్వహణ, సమావేశం, అతిథుల ప్రసంగాలు, ఇలా ఉదయం 9 గంటల నుంచే వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ఈ బాధ్యత, భారం అంతా ఉపాధ్యాయుల పైనే పడుతుంది. యోగాంధ్ర మాదిరి ఈ కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో గిన్నిస్ బుక్‌లో నమోదయ్యేలా నిర్వహించాలని ఒత్తిడి చేయడంతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు.
ఇతరుల పర్యవేక్షణ సరికాదు
మెగా పీటీఎంలో భాగంగా ఈ నెల 10న జరిగే సమావేశానికి ఇతర శాఖల ఉద్యోగుల పర్యవేక్షణ సరికాదు. గత పీటీఎంను విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజల సహకారంతో విజయవంతం చేశాం. ఇప్పుడు బాహ్య పరిశీలకుల పేరిట ఇతర శాఖ ఉద్యోగులను నియమించడం పాఠశాల నిర్వహణ వ్యవస్థను, ఉపాధ్యాయుల పనితీరును కించ పరచడమే. – బంకా వాసుబాబు,
పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి, పల్నాడు
ఒత్తిడికి గురవుతున్న
ఉపాధ్యాయులు
పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ప్రతి నెలా జరుగుతుండేవే. కానీ ఎప్పుడు లేని విధంగా అటు విద్యార్థులతో పాటు కార్యక్రమాలన్నీ క్షణాల్లోనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఉపాధ్యాయులను పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో అదనపు కార్యక్రమాలతో ఉపాధ్యాయులు మరింత ఒత్తిడికి గురవుతున్నారు. – ఎస్‌ఎం సుభాని,
ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు
పేరెంట్స్ మీట్ షరతులపై విద్యాశాఖ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేలా కూటమి చర్యలు రేపు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్

షరతులపై గుర్రు

షరతులపై గుర్రు