
మహిళ పొట్ట నుంచి నాలుగు పెన్నులు వెలికితీత
నరసరావుపేట: ఓ మహిళ పొట్ట నుంచి నాలుగు బాల్‌పెన్నులు డాక్టర్లు బయటకు తీసిన ఘటన పట్టణంలోని మాతాశ్రీ హాస్పిటల్‌లో శనివారం చోటుచేసుకుంది. వినుకొండ రోడ్డులోని మాతాశ్రీ హాస్పిటల్ అధినేత డాక్టర్ పి.రామచంద్రారెడ్డి ఆదివారం తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన ఓ మహిళ వాంతులతో బాధపడుతుండగా ఆమె కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. ఎండోస్కోపీ ద్వారా పరీక్షలు నిర్వహించగా పేగులో పెన్నులు ఉన్నట్లు గుర్తించినట్లు వివరించారు. అనుమానంతో సిటీస్కాన్ చేయించడంతో నాలుగు పెన్నులు ఉన్నట్లు బయటపడిందన్నారు. వెంటనే తమ హాస్పిటల్‌లోని అధునాతనమైన లాప్రోస్కోపిక్ పద్ధతిలో పొట్టలో నుంచి నాలుగు పెన్నులు చాకచక్యంగా బయటకు తీశామన్నారు. ఆమెను ఆరోగ్యవంతంగా ఇంటికి పంపించామని చెప్పారు. లాపరోస్కోపి ద్వారా ఇలాంటి అరుదైన శస్త్రచికిత్స చేయటం పల్నాడులో ఇదే మొదటిసారని డాక్టర్ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. కాగా, ఇలాంటి అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా చేసిన డాక్టర్‌ను పలువురు సహచర డాక్టర్లు, పట్టణ ప్రముఖులు అభినందించారు.
మాతాశ్రీ హాస్పిటల్‌లో లాప్రోస్కోపి ద్వారా అరుదైన శస్త్ర చికిత్స