
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
నరసరావుపేట ఈస్ట్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 9వ తేదీన తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పల్నాడు జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఏవూరి గోపాలరావు పిలుపు నిచ్చారు. కోటప్పకొండరోడ్డులోని సంఘం కార్యాలయంలో శనివారం గుంటుపల్లి బాలకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో గోపాలరావు మాట్లాడారు. కేంద్రం మద్దతు ధరల చట్టం తీసుకవస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చినా అమలులోకి రాలేదన్నారు. అలాగే కార్మికలోకాన్ని కార్పొరేట్ సంస్థలకు బానిసలుగా మార్చే లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలన్నారు. గిట్టుబాటు ధరల చట్టం తీసుకురావటంతో పాటు కేరళ తరహాలో రుణ విమోచన కమిషన్ ఏర్పాటు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి రూ.600 కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయా డిమాండ్ల సాధనకై తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. రైతు సంఘం నాయకలు సిహెచ్.సురేష్‌రాజా, ముని వెంకటేశ్వర్లు, జి.జాలయ్య తదితరులు పాల్గొన్నారు.