
జీఎస్‌టీ నమోదుచేయని వ్యాపారాలను గుర్తించాలి
కార్యాలయంలో జీఎస్‌టీపై సమీక్ష చేసిన జేసీ సూరజ్
నరసరావుపేట: జిల్లాలో జీఎస్‌టీ నమోదుచేయని వ్యాపారాలను గుర్తించి పన్ను పరిధిని విస్తరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే పేర్కొన్నారు. సోమవారం కార్యాలయంలో జిల్లా స్థాయిలో జీఎస్‌టీ వసూళ్లు సమర్ధ నిర్వాహణపై జేసీ అధ్యక్షతన సమన్వయకమిటీ సమావేశం నిర్వహించారు. వివిధశాఖల మధ్య సమన్వయం చేసుకోవటం ద్వారా పన్ను పరిపాలన మెరుగుపడుతుందని, తద్వారా పన్ను వసూళ్లు సమర్ధవంతంగా చేయవచ్చని పాల్గొన్న అధికారులు నిర్ణయించారు. దీనిలో ముఖ్యాంశాలు..మొండి బకాయిదారుల ఆస్తుల గుర్తింపుకు రెవెన్యూశాఖ, బ్యాంకు సహకారం ద్వారా పాత బకాయిలను వసూలుచేయటం, మైనింగ్ అక్రమ రవాణా ద్వారా ఎగవేసే పన్నును అరికట్టాలని, రాష్ట్ర పన్ను ఆదాయం పెంచేందుకు స్థానిక కొనుగోళ్లను తప్పనిసరి చేయాలని, జిల్లా స్థాయి అధికారులు వారి శాఖలలో టీడీఎస్ నిబంధన పాటించేలా చూడాలని, ఇంజనీరింగ్, పలు శాఖల నుంచి డేటా సేకరించి వృత్తిపన్ను పర్యవేక్షించాలని, మోసగాళ్లపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేసేందుకు పోలీసుశాఖ సహకారం తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవాలని నిర్ధారించారు. దీనిలో గుంటూరు–2 జేసీ బి.గీతామాధురి, డిప్యూటీ కమిషనర్ పి.శ్రీనివాసరావు, నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల అసిస్టెంట్ కమిషనర్లు పాల్గొన్నారు.