యడ్లపాడు: దోమలు ప్రజల ఆరోగ్యానికి ప్రథమ శత్రువులని..దోమల ద్వారా అనేక ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తాయని పల్నాడు జిల్లా మలేరియా అధికారి రవీంద్రరత్నాకర్ చెప్పారు. యడ్లపాడు 1, 2, కారుచోల గ్రామ సచివాలయాల్లో శుక్రవారం ఆయన సిబ్బందితో కలసి పర్యటించారు. కారుచోల గ్రామంలోని మురుగు నిలిచిన కాల్వల్లో అబెడ్‌ను చల్లించాలని ఆదేశించారు. ఆయా గ్రామాల్లో పలు కుటుంబాలను కలిసి ఫ్రైడే –డ్రైడే కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ఇళ్లల్లోనూ, పరిసర ప్రాంతాల్లోనూ నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. కొబ్బరిబొండాలు, పాతటైర్లు, రోళ్లు, మురుగు కాల్వల్లో నీరు నిల్వ ఉన్నందున దోమలు విస్తృతంగా పెరుగుతాయన్నారు. దోమల కాటు కారణంగా ప్రజలకు మలేరియా, ఫైలేరియా, డెంగీ, చికెన్‌గున్యా, మెదడువాపు వంటి అనేక వ్యాధులు వ్యాపిస్తాయన్నారు. ప్రతి శుక్రవారం ఇళ్లలోని అన్ని వస్తువుల్ని పొడిగా ఉంచుకోవడం వలన దోమల వ్యాప్తి తగ్గుతుందన్నారు. రాత్రివేళ దోమతెరలను వాడాలన్నారు. లార్వాను మొదటి దశలోనే గుర్తించి వాటిని వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి క్షేత్రస్థాయిలో చైతన్యం చేశారు. ముందుగా యడ్లపాడు ప్రాథమిక వైద్యశాల నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. పీహెచ్‌సీలోని రికార్డులు పరిశీలించి పలు సూచనలు చేశారు. పీహెచ్‌సీ వైద్యాధికారి గోపీనాయక్, సీహెచ్‌వో పున్నారావు, ఎస్‌యూఓ నారాయణ, సూపర్‌వైజర్లు రాజశేఖర్, పెర్సీ పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా మలేరియా అధికారి రవీంద్రరత్నాకర్