పశువులను తరలిస్తున్న నలుగురు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

పశువులను తరలిస్తున్న నలుగురు అరెస్టు

Jul 29 2026 2:04 AM | Updated on Jul 29 2026 2:04 AM

రాయగడ: పికప్‌ వ్యాన్‌లో అక్రమంగా పశువులు తరలిస్తున్న నలుగురు వ్యక్తులను చంద్రపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. పశువులతో పాటు వాటిని తరలించేందుకు వినియోగించిన పికప్‌ వ్యాన్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు చంద్రపూర్‌ పోలీసులు వాహన తనిఖీలను డంగసొరడ ప్రాంతంలో మంగళవారం నిర్వహించారు. ఒక పికప్‌ వ్యాన్‌లో పశువులను తరలిస్తున్నట్లు గుర్తించి తనిఖీలు చేశారు. అందులో ఆరు పశువులను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై మరోరంజన్‌ బిశ్వాల్‌ నేతృత్వంలో జరిగిన వాహన తనిఖీల్లో రఘునాధ్‌ కొరకొరియా, అనిల్‌ భత్ర, జగా గంటా, మునా భత్రలను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.

పట్టుబడిన అల్లరి కోతి

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని ఎనిమిదో వార్డు తారణీ మందిర ప్రాంతాంలో ఓ కోతి ఇటీవల చిన్నారులపై దాడి చేసి బీభత్సం సృష్టించింది. దీంతో చాలామంది పిల్లలు గాయపడ్డారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి చిన్నారులతోపాటు పెద్దలు కూడా భయాందోళన చెందారు. కోతి దాడి గురించి అటవీ శాఖ అధికారులకు సమాచారం రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. మల్కన్‌గిరి అటవీ రేంజర్‌ రమేష్‌ చంద్రరౌత్‌ ఆదేశాల మేరకు సిబ్బంది మంగళవారం గంటలకొద్ది శ్రమించి కోతిని వలపన్ని పట్టుకున్నారు. అనంతరం జిల్లా పశువైద్య శాలలో వైద్య పరీక్షలు చేయించారు. కోతి పూర్తి ఆరోగ్యంతో ఉండడంతో సురక్షితమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినట్టు అటవీ రేంజర్‌ రమేష్‌ చంద్రరౌత్‌ తెలిపారు. కోతి పట్టుబడడంతో జయపూరియాగూఢ గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

హత్య కేసులో నలుగురు అరెస్టు

మల్కన్‌గిరి: హత్య కేసులో నలుగురిని అరెస్టు చేసినట్టు చిత్రకొండ ఎస్‌డీపీవో ప్రదోష్‌ ప్రధాన్‌ మంగళవారం తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి రలెగఢ పంచాయతీ బంగురుసుధ గ్రామ సమీపంలోని జలాశయంలో మూడు రోజుల క్రితం ప్రకాష్‌ ఖిల్‌ అనే వ్యక్తి మృతదేహన్ని పాపరమేట్ల పోలీసులు వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు మృతుడు ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా మురలిగూఢ గ్రామానికి చెందిన ప్రకాష్‌గా గుర్తించారు. గారిబంధ్‌ గ్రామానికి చెందిన ఖారా రూపణా, ఖారా బుంజిబాబు, శికాటపల్లి గ్రామానికి చెందిన సాని ఖరా, ఘోడామాడగూల గ్రామానికి చెందిన లక్ష్మణ్‌ హాంతాల్‌లు కలిసి పాతకక్షల నేపథ్యంలో ప్రకాష్‌పై దాడి చేసి హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని జలాశయంలో పడేసినట్టు దర్యాప్తులో అంగీకరించారని పోలీసులు వెల్లడించారు. నిందితులను పూర్తి విచారణ అనంతరం కోర్టుకు తరలిస్తామని చిత్రకొండ ఎస్‌డీపీవో ప్రదోష్‌ ప్రధాన్‌ వివరించారు.

రాయగడలో ఆధునికీకరణ పనులు

భువనేశ్వర్‌: తూర్పు కోస్తా రైల్వే రాయగడ మండలంలో భద్రతకు సంబంధించిన ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారు. ఈ మండలంలో కెవుట్‌గుడ, సికర్‌పాయి మధ్య ఉన్న 32వ నంబర్‌ సొరంగం వద్ద ఈ పనులు త్వరలో ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో కొన్ని నిర్దిష్ట బుధ వారాల్లో 2 ప్రయాణికుల రైళ్ల సేవలు రద్దు చేస్తామని తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. ఈ నెల 29 నుండి ఆగస్టు 12 వరకు ప్రతి బుధ వారం 2 ప్రయాణికుల రైళ్ల సేవలు రద్దు చేస్తారు. రైలు నంబర్‌ 58537 కొరాపుట్‌ – విశాఖపట్నం ప్యాసింజర్‌, రైలు నంబర్‌ 58538 విశాఖపట్నం – కొరాపుట్‌ ప్యాసింజర్‌ రద్దవుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement