రాయగడ: గుణుపూర్ పట్టణంలో సొమవారం జరిగిన స్కూల్ వ్యాన్ ప్రమాదంలో నలుగురు చిన్నారులు గాయపడ్డారు. గుణుపూర్‌లో గల లండన్ కిడ్స్ ప్రైవేటు పాఠశాల నుంచి విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్తుండగా విక్రమపూర్ కూడలి సమీపంలో పనసగుడ రోడ్డులో వ్యాన్ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. డ్రైవర్ ఒక్కసారిగా వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే చిన్నారులను రక్షించి గుణుపూర్ సబ్ డివిజన్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో జగన్నాథపూర్ రాయిగుడ, పెద్ద హరసింగుడ, కై ఠాపదర్, పనసగుడ, గ్రామాలకు చెందిన విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.
దమణమండి గ్రామ దేవత మందిరంలో దొంగతనం
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ సమితి దమణహండి గ్రామంలో శీతల ఠకురాణి మందిరంలో తాళాలు విరచి బంగారు, వెండి ఆభరణాలు దొంగిలించారు. సోమవారం రాత్రి దుండగులు మందిరం తాళాలు విరిచి మా శీతల ఠకురాణి కళ్లు, కిరీటం,బంగారు, వెండి కిరీటాలు, కమరపటాలతో పాటు లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు దొంగిలించారు. అలాగే ఆ గ్రామంలో గల శివమందిరంలో కూడా దుండగులు తాళాలు విరిచి దొంగతనానికి ప్రయత్నించారు. శీతల ఠకురాణి మందిరంలో జరిగిన దొంగతనంపై గ్రామ ప్రజలు పోలీసులకు లిఖిత ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి దర్యాపు ప్రారంభించారు. దొంగలు కొట్‌పాడ్ ప్రాంతంలోగల దేవాలయాలు, మందిరాలను టార్గెట్ చేస్తు దొంగతనాలు చేస్తున్నారని పోలీసులు కేసులు నమోదు చేసి మిన్నకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పోలీసులు పెట్రోలింగ్ విస్తృత పరచి దొంగతనాలను అరికట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.


