రాయగడ: జిల్లాలోని పద్మపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కెందుగుడ గ్రామంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు దేవేంద్ర పండ నివాసంలో భారీ చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు సుమారు 70 తులాల బంగారు ఆభరణాలు, బంగారు బిస్కెట్లు, మరో రూ.1.50 లక్షల నగదును చోరీ చేసినట్లు బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాచారం ప్రకారం దేవేంద్ర పండా కుటుంబ సభ్యులతో కలసి ఈ నెల 22 వ తేదీన గంజాం జిల్లా షెర్‌ఘడ్‌లో బంధువుల ఇంటికి ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సమయంలో ఇంటికి తాళం వేసి ఉండగా, దుండగులు ప్రధాన తలుపు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. అనంతరం బీరువాను ధ్వంసం చేసి అందులో ఉన్న బంగారు నగలు, బంగారు బిస్కెట్లు, నగుదును దోచుకువెళ్లారు. ఆదివారం సాయంత్రం దేవేంద్ర కుటుంబంతో కలిసి ఇంటికి తిరిగి వచ్చి తర్వాత ఇంటి తలుపులు తెరిచి ఉండటం గమనించి లోనికి వెళ్లగా ఇంటి సామగ్రి చిందరవందగా ఉండటంతో పాటు బీరువాలో విలువైన వస్తువులు కనిపించకపోవడంతో వెంటనే పద్మపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పద్మపూర్ పోలీసులు సంఘటన స్థలానికి ఫోరెన్సిక్, డాగ్ స్క్యాడ్‌తో చేరుకున్నారు. అనంతరం సమీపంలో గల సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ ఘటనపై పద్మపూర్ ఐఐసీ ధరణీధర్ ప్రదాన్ మాట్లాడుతూ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు.


