జయపురం: అవిభక్త కొరాపుట్ విద్యా ప్రాణకేంద్రం జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయమని, కానీ వర్సిటీలో మౌలిక వసతులు లేవని కొరాపుట్ జిల్లా అఖిల భారత విద్యార్థి పరిషత్ జయపురం అద్యక్షులు జ్యోతీ రంజన్ పాణిగ్రహి అన్నారు. పాణిగ్రహి నేతృత్వంలో విశ్వవిద్యాలయ విద్యార్థులు మంగళవారం విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఘెరావ్ చేశారు. గత రాత్రి విశ్వ విద్యాలయం బాలికల హాస్టల్ శ్లాబ్ కూలి ఇద్దరు తీవ్రంగా గాయ పడ్డారని తెలిపారు. చాలాకాలంగా భవనాల విషయం చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని నేత ఆరోపించారు. ఉత్కళమణి హాస్టల్ భవనాల శ్లాబ్ కూడా శిథిలావస్థలో ఉందని తెలిపారు. వెంటనే విశ్వ విద్యాలయ సమస్యలు పరిష్కరించాలని కోరారు.


