● కలెక్షన్ రాజ్‌పై పెరుగుతున్న ఆరోపణలు
● కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తూ అధికార దర్పం ప్రదర్శించారని ఆగ్రహం
● విమర్శలు గుప్పిస్తున్న మెడికల్ ఆఫీసర్లు
అరసవల్లి: జిల్లా వైద్యారోగ్య శాఖలో ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్న జాతీయ ఆరోగ్య మిషన్‌లో కీలకాధికారిగా పనిచేస్తున్న కలెక్షన్ రాజ్.. కేవలం ఓ కాంట్రాక్టు ఉద్యోగే. అయినప్పటికీ డీఎంహెచ్‌వోకి మించిన అధికార దర్పం ప్రదర్శించాడనే విమర్శలున్నాయి. ఇటీవల వరకు డీఎంహెచ్‌వోగా పనిచేసిన అధికారి ఇచ్చిన ప్రత్యేక ‘ఆసరా’ ఫలితంగా సదరు కలెక్షన్ రాజ్ హద్దులు మీరి ప్రవర్తించారని మెడికల్ ఆఫీసర్లే విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలసీల్లో భాగంగా వైద్యశాఖలో చేపట్టాల్సిన పలు నిర్ణయాలు, అమలు చేయాల్సిన కార్యక్రమాలపై ప్రగతి నివేదికలపై ఏకంగా సదరు కాంట్రాక్టు ఉద్యోగే అంతా తానై వ్యవహరించి జిల్లావ్యాప్తంగా ఉన్న మెడికల్ ఆఫీసర్లు (పీహెచ్‌సీ డాక్టర్లు), సీనియర్ అసిస్టెంట్లకు కూడా దిశానిర్దేశం చేసే స్థాయికి చేరారు. ఇక్కడితో ఆగకుండా ఏకంగా పీహెచ్‌సీ డాక్టర్లపై తిట్లదండకాలకు కూడా పూనుకున్నట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో జిల్లాలో ఈనెల మొదటివారం వరకు కూడా జూమ్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించి మరీ ఆదేశాలు జారీ చేసే స్థితికి చేరారు. డీఎంహెచ్‌వో ఇచ్చిన చొరవ కారణంగానే సదరు ఎన్‌హెచ్‌ఎం అధికారి చేసిన హడావుడిపై మెడికల్ ఆఫీసర్లు నోరుమెదిపే ధైర్యం చేయలేదు. అయితే ఇటీవల డీఎంహెచ్‌వో బదిలీ కావడంతో ఒక్కసారిగా మెడికల్ ఆఫీసర్లు అంతా ఒక్కటై ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్టు అధికారి తీరుపై ధ్వజమెత్తారు. ఈక్రమంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు ఎన్‌హెచ్‌ఎంలో అవకతవకలపై, సదరు కాంట్రాక్టు ఉద్యోగి నిర్వాకంపై ఫిర్యాదులు పంపించారు. దీంతో ఈ అంశం జిల్లా వైద్యశాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది.
డీడీవో అధికారం నాకొద్దు..!
ఎన్‌హెచ్‌ఎం, డెమో ఆధ్వర్యంలో చేపడుతున్న పలు కార్యక్రమాల ఖర్చులు, నకిలీ బిల్లులను సక్రమం చేసుకునే దిశలో ఆడిట్ బృందానికి ఖర్చులకంటూ జిల్లాలో మొత్తం 100 పీహెచ్‌సీ, సీహెచ్‌సీ తదితర వైద్యశాలల నుంచి సుమారు రూ.6 లక్షల వరకు వసూళ్లు చేసిన కలెక్షన్ రాజ్ వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో నిబంధనలకు విరుద్దంగా డీడీవో అధికారాలను చెలాయిస్తూ బలిపశువుగా మారిన డిప్యూటీ డెమో ఎర్రన్న తన అధికారాలను వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు ఆయన ప్రత్యేక నివేదికతో కూడిన వివరణను కూడా ఉన్నతాధికారులకు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే రెగ్యులర్ డీఎంహెచ్‌వో లేకపోవడంతో ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారని కార్యాలయ వర్గాలు చర్చించుకుంటున్నారు. ఏదిఏమైనా వైద్య శాఖలో అవినీతి అక్రమాలపై నిజానిజాలు నిగ్గుతేలాలంటే ఉన్నతాధికారులు సమగ్ర విచారణకు ఆదేశించాలని వైద్యశాఖ ఉద్యోగులే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


