పర్లాకిమిడి: ప్రతి గుత్తేదారు ప్రభుత్వ ప్రజాప్రనులు, ఇరిగేషన్, ఆర్‌డీ డిపార్ట్‌మెంట్ టెండర్లను షెడ్యుల్డ్ ధరలకే కోట్ చేయాలని గజపతి గుత్తేదారుల సంఘం అధ్యక్షుడు భరత్ భూషణ్ మహతి అన్నారు. స్థానిక బిజూ కళ్యాణ మండపం ఆవరణలో శ్రీకృష్ణచంద్రగజపతి కంట్రాక్టర్స్ సంఘం సాధారణ సభ్యుల సమావేశం మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గంజాం, గజపతి జిల్లాలకు చెందిన కంట్రాక్టర్లు, ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఐదు కోట్ల రూపాయల లోపు టెండర్లను గజపతి గుత్తేదారులకు విడిచిపెట్టాలన్నారు. భవిష్యత్‌లో వందలకోట్ల రూపాయల టెండర్లు ఉంటే వాటిని స్పెషల్ క్లాస్ కంట్రాక్టర్లకు, ఏజెన్సీలకు ఇప్పిస్తామని బి.బి.మహంతి అన్నారు. ఇతర జిల్లాల గుత్తేదారులు కోటి రూపాయలు, అంతకంటే తక్కువ ప్రజాపనుల టెండర్లను తక్కువ ధరలకు కోట్ చేసి పనులు చేజిక్కించుకుంటున్నారని, అందువల్ల జిల్లాకు చెందిన గుత్తేదారులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. గుత్తేదారుల సంఘం సర్వసభ్య సమావేశానికి బల్లారాం దోళాయి, గిరిగోవింద, స్పెషల్ క్లాస్ గుత్తేదారు పి.వరప్రసాద్, దేవషిస్ మిశ్రా, పి.నాగరాజు, ఎ, బి, సి, డి క్లాస్ కంట్రాక్టర్లు పాల్గొన్నారు.


