జయపురం: కొరాపుట్ జిల్లాలో రైలు నిర్మాణం కోసం సేకరిస్తున్న భూములకు ఇస్తున్న నష్ట పరిహారం ఉచిత మూల్యం లభించటం లేదని, పక్క నవరంగపూర్ జిల్లాలో ఎక్కువ పరిహారం లభిస్తు న్నదని భూములకు నస్ట పరిహారం చెల్లించటంలో పక్షపాతం చూపుతుందని కొరాపుట్ జిల్లా బీజేడీ ఆరోపించింది. వెంటనే కొరాపుట్ జిల్లా కలక్టర్ కలుగ చేసుకొని కొరాపుట్ జిల్లా భూ దాతలకు సముచిత పరిహారం చెల్లించేందుకు తగు చర్యలు చేపట్టాలని ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది. స్థానిక హాల్‌లో జయపురం సభాగృహంలో సోమవారం బీజేడీ నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో రాష్ట్ర బీజేడీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రబినారాయణ నందో మాట్లాడుతూ కొరాపుట్ జిల్లా రైతులకు సముచిత మూల్యం లభించడం లేదన్నారు. భూములకు వాస్తవ ధర చెల్లించేందుకు కలెక్టర్‌కు అధికారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నవరంగపూర్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలో హెక్టార్ కు రూ.3 కోట్లు, పట్టణ ప్రాంతాలలో హెక్టారుకు రూ.7 కోట్లకు పైనే చెల్లిస్తున్నారని ఆయన వెల్లడించారు. అయితే కొరాపుట్ జిల్లాలో ఆ ధరలు చెల్లించేందుకు కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.


