ఏం జరుగుతోంది..! | - | Sakshi
Sakshi News home page

ఏం జరుగుతోంది..!

Jul 28 2026 1:36 AM | Updated on Jul 28 2026 1:36 AM

● ఆదిత్యాలయంలో అక్రమ విధానాలపై విజిలెన్స్‌ దృష్టి ● గతంలో నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్‌ ఉద్యోగికి లబ్ధి ● డిప్యుటేషన్‌ పూర్తయినా ఉద్యోగికి ఎల్‌పీసీ ఇవ్వని ప్రస్తుత ఈవో ● ఐదు నెలలుగా జీతాలకు నోచుకోని సదరు ఉద్యోగి

రికవరీలు ఉండడంతోనే ఆలస్యం

● ఆదిత్యాలయంలో అక్రమ విధానాలపై విజిలెన్స్‌ దృష్టి ● గతంలో నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్‌ ఉద్యోగికి లబ్ధి ● డిప్యుటేషన్‌ పూర్తయినా ఉద్యోగికి ఎల్‌పీసీ ఇవ్వని ప్రస్తుత ఈవో ● ఐదు నెలలుగా జీతాలకు నోచుకోని సదరు ఉద్యోగి

అరసవల్లి: దేవదాయ శాఖలో నిబంధనలకు విరుద్ధంగా రెండేళ్ల ఎరియర్స్‌తో కూడిన పీఆర్సీని పొందిన ఓ ఆలయ ఉద్యోగికి.. నాలుగైదు నెలలుగా జీతాలు లేకుండా అవస్థ పడేలా గత అక్రమాలు వెంటాడుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ జగన్నాథ స్వామివారి ఆలయానికి చెందిన అటెండర్‌ శ్రీనివాస్‌, టెక్కలి రావివలస ఎండల మల్లికార్జున స్వామివారి ఆలయానికి డిప్యుటేషన్‌ విధానంలో కొన్నేళ్లు విధులు నిర్వర్తించారు. అనంతరం అరసవల్లి ఆదిత్యాలయానికి డిప్యుటేషన్‌ మీద 2022లో విధుల్లో చేరాడు. అయితే అప్పట్లో పనిచేసిన డిప్యూటీ కమిషనర్‌/ఈవో చంద్రశేఖర్‌ నిబంధనలకు విరుద్ధంగా జీవో 888ని అతిక్రమించి డిప్యుటేషన్‌ మీద పనిచేస్తున్న శ్రీనివాస్‌కు రెండేళ్ల పెండింగ్‌ ఎరియర్స్‌తో కూడిన పీఆర్సీని అమలు చేశారు. దీంతో ఒక్కసారిగా రూ.5.72 లక్షల లబ్ధి చేకూర్చి తర్వాత ఈవో చంద్రశేఖర్‌ బదిలీపై వెళ్లిపోయాడు. తర్వాత జరిగిన పరిణామాల్లో విధుల్లో చేరిన ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ మాత్రం అటెండర్‌ శ్రీనివాస్‌ డిప్యుటేషన్‌ గడువు ముగిసిందంటూ తిరిగి ఆయనను రావివలస ఆలయానికి వెళ్లిపోవాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు.

ఎల్‌పీసీ ఇవ్వని వైనం

అరసవల్లిలో డిప్యుటేషన్‌ క్యాన్సిల్‌ కావడంతో యథావిధిగా ముందు పనిచేసిన రావివలస ఎండల మల్లికార్జున స్వామివారి ఆలయానికి అటెండర్‌ శ్రీనివాస్‌ను ఆలయ ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ పంపిస్తూ అరసవల్లి నుంచి రిలీవ్‌ చేసేశారు. ఇది జరిగి సుమారు నాలుగైదు నెలలు గడిచింది. అయితే అరవసల్లిలో పీఆర్సీ పొందిన తర్వాత అటెండర్‌ శ్రీనివాస్‌కు అమాంతం జీతం పెరిగినందున.. అంత జీతం రావివలసలో ఇవ్వలేమంటూ అక్కడి ఈవో గురునాథరావు స్పష్టం చేస్తున్నారు. అయితే లాస్ట్‌ పేమెంట్‌ సర్టిఫికేట్‌(ఎల్‌పీసీ) తెచ్చుకుంటే జీతాల సంగతి తేలిపోతుందనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కాగా తెర వెనుక కారణమేంటో గానీ అరసవల్లి నుంచి రిలీవ్‌ చేసినప్పటికీ నేటి వరకు ఎల్‌పీసీ మాత్రం ఇవ్వకుండా ఆలయ ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ తాత్సారం వహిస్తున్నారు. దీంతో అటెండర్‌ శ్రీనివాస్‌ అటు అరసవల్లి నుంచి.. ఇటు రావివలస నుంచి కూడా జీతం పొందలేక అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉండగా దీనివెనక ఆర్థిక లావాదేవిలు జరుగుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్‌పీసీ ఇవ్వకుండా మళ్లీ అరసవల్లిలో అటెండర్‌ శ్రీనివాస్‌ను విధుల్లో చేర్చుకునే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారాలేవీ బయట పెట్టకుండానే స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌ను సైతం బురిడి కొట్టించి మరీ అనుకూల లెటర్‌ను కూడా పొందినట్లుగా సమాచారం. ఏది ఏమైనా ఆర్థిక లావాదేవీల నడుమ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటే అధికారులకు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విజిలెన్స్‌ ఆరా..!

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పటినుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది వరకు అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో జరిగిన పలు వివాదాస్పద వ్యవహారాలపై విజిలెన్స్‌ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. అప్పట్లో ఇదే ఆలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసిన కృష్ణమాచార్యులు ఇచ్చిన ఽఆధారపూర్వక ఫిర్యాదుల మేరకు విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు. అయితే ఇందులో అటెండర్‌ శ్రీనివాస్‌ పీఆర్సీ వ్యవహారం కూడా ఉండడం గమనార్హం. అయితే తాజాగా గత నాలుగైదు నెలలుగా శ్రీనివాస్‌కు జీతాలు ఇవ్వకుండా ఎల్‌పీసీ ఇవ్వని పరిస్థితులపై కూడా విజిలెన్స్‌ ఆరా తీస్తోందని సమాచారం. ఆర్థిక లావాదేవిలపై కూడా ఇప్పటికే దృష్టి సారించిందని తెలుస్తోంది.

అటెండర్‌ శ్రీనివాస్‌కు డిప్యుటేషన్‌ గడువు ముగిశాక తిరిగి రావివలసలో జాయిన్‌ కావాలని ఉత్తర్వులు జారీ చేశాం. అయితే ఎల్‌పీసీ ఇంకా ఇవ్వని విషయం వాస్తవమే. ఆయనకు గతంలో పలు ఆర్థిక లబ్ధి అంశాల్లో రికవరీలు చేయాల్సి ఉందని భావిస్తున్నాం. వాటిని పరిశీలించాక ఎల్‌పీసీ ఇచ్చేందుకు చర్యలు చేపడతాం. అంతవరకు జీతాల పరిస్థితి తేలదు.

– కేఎన్‌వీడీవీ ప్రసాద్‌,

అరసవల్లి ఆలయ ఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement