నీలాద్రి విజేతో రథ యాత్రకు తెర | - | Sakshi
Sakshi News home page

నీలాద్రి విజేతో రథ యాత్రకు తెర

Jul 28 2026 1:36 AM | Updated on Jul 28 2026 1:36 AM

భువనేశ్వర్‌: పవిత్ర ఆషాఢ శుక్ల పక్ష త్రయోదశి తిథి పురస్కరించుకుని సోమ వారం శ్రీ క్షేత్రంలో నీలాద్రి విజే అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రథాలపై ఆశీనులై ఉన్న మూలవిరాటులను ఒక్కోటిగా వరుస క్రమంలో కిందకు దించి ఆలయ సంప్రదాయ రీతులతో సురక్షితంగా శ్రీ మందిరం రత్న వేదికపైకి బలభద్ర స్వామి, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథుని మూల విరాటులతో చక్ర రాజు సుదర్శనుడు, ఉత్సవ మూర్తులు మదన మోహన్‌, రామకృష్ణులు తరలించడంతో నీలాద్రి విజే ఘట్టం విజయవంతంగా ముగిసింది. దీంతో పూరీ జగన్నాథ స్వామి రథ యాత్రకు తెర పడింది. శ్రీ గుండిచా నుంచి మారు రథ యాత్రలో శ్రీ మందిరం సింహ ద్వారం ఆవరణకు 3 రథాలు చేరిన తర్వాత ఏకాదశి నాడు స్వర్ణ అలంకారం, ద్వాదశి నాడు ఒధొరొ పొణ, త్రయోదశి నాడు నీలాద్రి విజేతో వరుస క్రమంలో జరిగే అత్యంత ప్రముఖమైన ఉత్సవాలు. నీలాద్రి విజేలో సంధ్యా ధూపం తర్వాత రథాలపై దేవుళ్లను దించే గొట్టి పొహండి కార్యక్రమం ప్రారంభించారు. పొహండి తర్వాత జయ, విజయ ద్వార సమీపంలో లక్ష్మీ నారాయణ వాదన జరుగుతుంది. ఇక్కడ సేవాయత్‌లు ప్రతీకాత్మకంగా మహాప్రభు జగన్నాథ, శ్రీ మహా లక్ష్మి మధ్య కవితాత్మకంగా సంభాషణను నిర్వహిస్తారు. దీని తర్వాత శ్రీ మహాలక్ష్మికి రస గుల్లను సమర్పించడంతో శ్రీ మహా లక్ష్మి ప్రియ నాథుని సాదరంగా శ్రీ మందిరం లోనికి ఆహ్వానం పలుకుతుంది. రస గుల్ల కేవలం మిఠాయి మాత్రమే కాదు. ఇది ఒడిశా గొప్ప పాక సంప్రదాయానికి ప్రతీక. పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయంలో జరిగే పవిత్రమైన నీలాద్రి విజే ఆచారంలో ఒక అంతర్భాగం. ఈ సందర్భంగా రసగుల్ల దినం జరుపుకోవడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement