కొరాపుట్: భార్యను గొడ్డలితో నరికి భర్త హత్య చేసిన ఘటన సోమవారం నబరంగ్‌పూర్ జిల్లా పపడాహండి సమితి హత్తి బరి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన తులవతి గౌడ (36) ని భర్త ప్రహ్లాద గౌడ గొడ్డలితో నరికి హత్య చేశాడు. భార్యాభర్తల మధ్య గొడవ ముదిరి హత్యకు దారి తీసిందని పోలీసులు పేర్కొన్నా రు. మృతురాలి తండ్రి పపడాహండి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని పపడా హండి పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పపడాహండి ప్రభుత్వాస్పత్రికి పోస్టు మార్టం కోసం తరలించారు. మృతురాలికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.
లోయలో పడిన ఓఎస్‌ఆర్టీసీ బస్సు
రాయగడ: భువనేశ్వర్ నుంచి మల్కన్‌గిరి వైపు వెళుతున్న ఓఎస్‌ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. జిల్లాలోని పద్మపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఖంబారిగుడ సమీపంలో ఈ ఘటన సొమవా రం అర్ధరాత్రి చోటు చేసుకుంది. భువనేశ్వర్ నుంచి వస్తుండగా ఖంబారిగుడ వద్ద ఎదురుగా వస్తున్న మరో వాహనానికి సంబంధించిన హెడ్ లైట్లు బస్సు డ్రైవరు పై పడటంతో బండి అదుపుతప్పింది. దీంతో సమీపంలొ గల లోయలో బస్సు పడిపోయింది. అయితే బస్సులో కేవలం డ్రైవరు, కండక్టర్ మాత్రమే ఉన్నారు. ఈ ప్రమాదంలొ ఇద్దరూ సురక్షితంగా బయట పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.


