● రథ యాత్ర అంతిమ ఘట్టం
● రసగుల్ల దినం
భువనేశ్వర్: విశ్వవిఖాత్య జగతి నాథుని వార్షిక రథ యాత్ర సోమవారంతో ముగియనుంది. సుదీర్ఘంగా నెలల తరబడి అహర్నిశలు శ్రమించి యాత్రని జయప్రదం చేయడంలో పలు వర్గాలు తలమునకలయ్యాయి. స్వామి యాత్ర ఆద్యంతాలు రస్తవత్తరంగా సాగుతుంది. చిట్ట చివరి నీలాద్రి విజే పురస్కరించుకుని లక్ష్మీనారాయణుల దాంపత్య ముచ్చటలు మురిపిస్తాయి. నవ దినాత్మక గుండిచా యాత్ర ముగించుకుని యధా ప్రకారం మందిరంలోనికి ప్రవేశించిన తరువాత మందిరం సింహ ద్వారం మూత బడుతుంది. అంతకు కొన్ని క్షణాల ముందు అన్న, సోదరి సుభద్ర ఆటంకం లేకుండా ప్రవేశించిన మరుక్షణమే జగతి నాథునికి ద్వారం మూత బడడం వెనక మర్మం ఎరిగిన జగతి నాథుడు ప్రియ సఖి మనస్తాపం తొలగించేందుకు నోరూరించే రసగుల్ల మిఠాయిని సమర్పించడం నీలాద్రి విజే ఘట్టంలో ముచ్చట గొలిపించే తంతు. దేవేరి మహా లక్ష్మిని బుజ్జగించి ఆత్మీయ స్వాగతంతో జగన్నాథుడు సింహ ద్వారం గుండా లోనికి ప్రవేశించి యధాతథంగా శ్రీ మందిరం రత్న వేదికపై ఆసీనుడై తిరిగి స్నాన పూర్ణిమ వరకు నిరవధికంగా భక్తులకు నిత్య దర్శనం ప్రసాదిస్తాడు. నీలాద్రి విజే సందర్భంగా భక్తులు, యాత్రికులు రసగుల్ల దేవుళ్లకు నివేదిస్తారు. నోరూరించే మిఠాయి రసగుల్ల ఒడిశా వారసత్వంతో ముడిపడిన వంటకంగా గుర్తింపు సాధించడంతో పాటు రసగుల్ల దినంగా జరుపుకోవడం విశేషం. 2015 సంవత్సరం తొలి సారిగా నీలాద్రి విజే పురస్కరించుకుని రసగుల్ల దినం జరుపుకోవడం ఆరంభమైంది. రసగుల్ల సాంస్కృతిక, వారసత్వం చాటి చెప్పేందుకు ఈ ఉత్సవం ముడిపడడం విశేషం.


