పర్లాకిమిడి: మారు రథయాత్ర ముగింపు సందర్భంగా స్థానిక రాజవీధి శ్రీజగన్నాథ మందిరం ఆవరణలో జిల్లా సాంస్కృతిక శాఖ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో భక్తి సంగీత, నృత్య కార్యక్రమం గత రాత్రి జరిగింది. రెండురోజుల పాటు జరిగిన ఈ నృత్య కార్యక్రమంలో పదామృత నృత్యనయన, డ్రీమ్స్ డ్యాన్స్ గ్రూపు, ఏజే క్రియేటివ్ తదితర సంస్థల విద్యార్థులు ఒడిస్సీ నృత్యాల ద్వారా ప్రేక్షకులకు అలరించారు. కార్యక్రమంలో ఏడీఎం మునీంద్ర హానగ, జిల్లా పరిషత్ అసిస్టెంటు సీడీఓ పృథ్వీరాజ్ మండళ్, పూర్ణచంద్ర మహాపాత్రో, గురు రఘునాథ పాత్రో, జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత బినోద్ చంద్ర జెన్నా, నృసింహా చరణ్‌పట్నాయిక్, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారిని అర్చనా మంగరాజ్, బిచిత్రా నంద బెబర్తా పాల్గొన్నారు. ఈ నెల 28 వరకూ జగన్నాథ అడపా మందిరం వద్ద సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని డీసీఓ అర్చనా మంగరాజ్ తెలిపారు.


