భువనేశ్వర్: శ్రీ జగన్నాథుని వార్షిక రథయాత్ర ఉత్సవాల్లోసంధ్యా దర్శనం అత్యంత ముఖ్యమైన ఘట్టాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. శ్రీగుండిచా ఆలయంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి 9 రోజులపాటు కొలువుదీరిన నవ దినాత్మక యాత్ర సంధ్యా దర్శనంతో ముగుస్తుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంధ్యా దర్శనం బహుడా యాత్ర ప్రారంభానికి ముందు జన్మ వేదికపై గురువారం భక్తులకు చివరి దర్శనంగా ప్రాప్తించింది.
మారు రథ యాత్ర (బహుడా) సమయంలో మూల విరాట్‌ల తిరుగు ప్రయాణం ప్రారంభించే ముందు పవిత్ర చతుర్థా మూర్తుల ఆశీర్వాదం పొందడానికి లక్షలాది మంది భక్తులు గుండిచా ఆలయానికి తరలివచ్చారు.
భక్తులకు సింహ ద్వారం ద్వారా గుండిచా ఆలయంలోకి ప్రవేశం కల్పించి కేటాయించిన బహారొ కఠొ (వెలుపలి ప్రాంగణం) దర్శన ప్రదేశం నుంచి అడపా మండపంపై కొలువై ఉన్న దేవతా మూర్తులను దర్శించుకుని నక్కొ చొణ ద్వారం గుండా బయటకు విడిచిపెట్టారు. ఉదయం 5 గంటలకు ద్వారాలు తెరిచి అంతరాలయం శుద్ధి, మంగళ హారతి, మైలమ్, దైనందిన సేవలు ముగించి అలంకరణ పూర్తికావడంతో భక్తులకు దర్శనం కోసం అనుమతించారు. ప్రత్యేక టిక్కెట్లు దర్శనం నివారించారు. సేవాయత్ కుటుంబాలకు చెందిన మహిళా సభ్యులకు అంతరాలయంలోకి ప్రవేశించే సంప్రదాయ హక్కును యథావిధిగా కొనసాగించారు.
అర్ధరాత్రి వరకు అడపా ఒభొడా లభ్యత..
దర్శన సమయం ముగిసిన తర్వాత కూడా ఆనంద్ బజార్ సందర్శించే భక్తుల సౌకర్యార్థం నక్కొ చొణ ద్వారం తలుపులు తెరిచి ఉంచారు. గుండిచా ఆలయంలో జన్మ వేదికపై కొలువుదీరిన దేవతలకు నైవేద్యంగా సమర్పించిన పవిత్రమైన ప్రసాదం అడపా ఒభొడా అర్ధ రాత్రి వరకు లభించే ఏర్పాట్లు చేశారు. నిర్దేశించిన నిష్క్రమణ ద్వారం ద్వారా భక్తులు మహా ప్రసాదాన్ని తీసుకు వెళ్లేందుకు వీలు కల్పించారు. పవిత్ర బహుడా యాత్రకు సంబంధించిన ముందుస్తు సన్నాహాలు, క్రతువుల దృష్ట్యా గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శ్రీ గుండిచా ఆలయ సింహ ద్వారం గుండా సాధారణ ప్రజల ప్రవేశం నిలిపి వేసి సంధ్యా దర్శనం మూసివేసినట్లు శ్రీ మందిరం ప్రధాన నిర్వాహకుడు డాక్టర్ అరవింద కుమార్ పాడీ తెలిపారు.
సాయంత్రం 5 గంటలకు సంధ్యా హారతి తర్వాత సంధ్యా ధూపం సమర్పించారు. ఆ తర్వాత బొడొ సింగార్ అలంకరణ, పవళింపు కార్యక్రమాలు ఆచారం ప్రకారం ముగించారు. శుక్రవారం తెల్లవారుజాము వరకు జరిగే సాంప్రదాయ అర్ధరాత్రి వేడుకలు నేపథ్యంలో దేవుళ్ల మారు రథ యాత్రకు ముందు శ్రీగుండిచా ఆలయ శుద్ధి కార్యక్రమాలు, అనేక ముఖ్యమైన క్రతువులు నిర్వహించాల్సి ఉన్నందున సాయంత్రం 6 గంటల నుంచి భక్తుల ప్రవేశం నివారించినట్లు శ్రీ మందిరం ప్రధాన నిర్వాహకుడు అరవింద కుమార్ పాడీ తెలిపారు.


