రాయగడ: రాజ్యసభ మాజీ ఎంపీ, బిజు స్వాభిమాన్ మంచ్ వ్యవస్థాపకులు నెక్కంటి భాస్కరరావు 74 వ జన్మదిన వేడుకలు స్థానిక రాణిగుడఫారంలో గల ఆయన స్వగృహంలో గురువారం వారి అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే ఆయన నివాసానికి మిత్రులు, శ్రేయోభిలాషులు, సామాజిక, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, బిజు స్వాభిమాన్ మంచ్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నెక్కంటికి పుష్పగుచ్ఛాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ప్రజా సేవ ప్రస్థానాన్ని కొనియాడారు.
జన్మదినం సందర్భంగా స్థానిక తేజస్వీ హోటల్ మైదానంలో గల బిజు స్వాభిమాన్ మంచ్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. నెక్కంటి మాట్లాడుతూ తన ఊపిరి ఉన్నంత కాలం ప్రజా సేవలో తాను ఉంటానని ప్రజల కష్ట,సుఖాల్లో ఎల్లవేళలా చేదోడుగా ఉంటానని అన్నారు. ఆదివాసీ,హరిజన ప్రాంతమైన ఈ జిల్లాలో ఎన్నొ మౌలిక సౌకర్యాలను కల్పించానని అన్నారు. తన వెంట ఉన్న వారి కోసం తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. గుణుపూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శివ ప్రసాద్ గౌడొ, మిలిపాడి, మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక, శ్రీక్షేత్ర టౌన్‌షిఫ్ అధినేత దూడల శ్రీనివాస్, మజ్జిగౌరి మందిరం పరిచాలన కమిటి సభ్యులు ఇప్పిలి సన్యాసిరాజు తదితర ప్రముఖులు నెక్కంటికి అభినందనలు తెలియజేశారు.


