● 15 మందికి గాయాలు
కొరాపుట్: ప్రైవేట్ బస్సు బోల్తాపడడంతో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. గురువారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర సరిహద్దు ఇంద్రావతి నది ఒడ్డున అమలి జంక్షన్ వద్ద ఒక ప్రైవేట్ బస్సు బోల్తాపడింది. నబరంగ్‌పూర్ జిల్లా చందాహండి నుంచి జయపూర్ వెళ్తున్న ఈ బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకుపోయింది. అదే సమయంలో పొలాల్లో పనులు చేస్తున్న రైతులు ప్రమాద స్థలం వద్దకు వచ్చి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే అంబులెన్స్ ద్వారా నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో 15 మంది ప్రయాణికుల చేరినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం తెలుసుకున్న నబరంగ్‌పూర్ కలెక్టర్ మహేశ్వర్ స్వయ్, ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. క్షతగాత్రులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలు గురించి వాకబు చేశారు.


