భువనేశ్వర్: అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రైల్వే భద్రతను బలోపేతం చేసే దిశగా తూర్పు కోస్తా రైల్వేకు చెందిన రైల్వే రక్షణ దళం (ఆర్‌పీఎఫ్) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత రోబోటిక్ నిఘా వ్యవస్థ డీఎస్‌సీ అర్జున్‌ను (డెడికేటెడ్ సెక్యూరిటీ ఛాసిస్ అడ్వాన్సడ్ రైల్వే జంక్షన్ అండర్ నెట్‌వర్క్ ఎనేబుల్డ్ సర్వైలెన్‌న్స్) ప్రవేశపెట్టింది. తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్, సీనియర్ రైల్వే అధికారులు, రైల్వే రక్షణ దళం (ఆర్‌పీఎఫ్) అధికారుల సమక్షంలో బుధవారం ఏఐ ఆధారిత రోబోటిక్ నిఘా వ్యవస్థ డీఎస్‌సీ అర్జున్ సేవలను ప్రారంభించారు. ఈ రోబోటిక్ వ్యవస్థను రైల్వే ప్లాట్ ఫారంలు, స్టేషన్ కాంకోర్స్‌లు, టికెట్ బుకింగ్ కార్యాలయాలు, విరామ గదులు, సర్క్యులేటింగ్ ఏరియాలు, పార్కింగ్ జోనులు, పార్సెల్ కార్యాలయాలు, మెరుగైన నిఘా అవసరమయ్యే ఇతర సమస్యాత్మక ప్రదేశాల్లో మోహరించవచ్చు. నిరంతర పర్యవేక్షణ, ఇంటెలిజెంట్ అనలిటిక్స్ ద్వారా నేరాల నివారణ, రద్దీ సమయాల్లో ప్రయాణికుల రాకపోకల నిర్వహణ, రైల్వే ఆస్తులను రక్షించడం, అగ్ని ప్రమాదాలు, వైద్యపరమైన సంఘటనలు, భద్రతా సంబంధిత పరిస్థితుల వంటి అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతంగా స్పందించడంలో డీఎస్‌సీ అర్జున్ ఆర్‌పీఎఫ్ సిబ్బందికి సహాయపడుతుంది. దీని అధునాతన లక్షణాల్లో ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు, రియల్ టైమ్ జన సమూహ విశ్లేషణ, ప్రయాణికుల సంఖ్యను లెక్కించడం, అనుమానస్పద సామాను, కార్యకలాపాలను గుర్తించడం, పబ్లిక్ అడ్రస్ ప్రకటనలు, లైవ్ వీడియో స్ట్రీమింగ్, తక్షణ హెచ్చరికలను జారీ చేయడం వంటివి ఉన్నాయి. భారతీయ రైల్వేలో రోబోటిక్ పోలీసింగ్ ప్రస్థానం 2020లో కోవిడ్ 19 మహమ్మారి సమయంలో మధ్య రైల్వేలో కెప్టెన్ అర్జున్‌తో ప్రారంభమైంది. 2026 జనవరి 23న తూర్పు కోస్తా రైల్వే విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో హ్యూమనాయిడ్ రోబోట్ ఏఎస్‌సీ అర్జున్‌ను ప్రవేశ పెట్టారు.


