రాయగడ: దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు నేపథ్యంలో కొత్తగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) అసిస్టెంట్ లోకొ పైలట్‌ల పోస్టింగ్ ప్రక్రియను జాయింట్ ప్రొసిజర్ ఆర్డర్ (జేపీనో) విడుదలయ్యే వరకు నిలిపివేయాలని రాయగడ డివిజన్ రైల్వే ఉద్యోగులు కోరారు. ఈ మేరకు డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం)కు బుధవారం రాయగడలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖపట్నం డివిజనల్‌లో ఏఎల్‌పీల పొస్టింగ్‌లు వేగంగా కొనసాగుతున్నప్పటికీ , జేపీఒ అమలు కాకముందే ప్రక్రియ చేపట్టడం వల్ల జోన్ విభజన నిబంధనలు, సీనియారిటీ సూత్రాలు పూర్తిగా అమలు కావడం లేదన్నారు. ప్రస్తుతం రాయగడ, విశాఖపట్నం డివిజన్లు రెండూ ఓకే సీనియారిటీ యూనిట్ పరిధిలో కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ తరుణంలో ముందస్తు పోస్టింగులు చేపట్టడం వల్ల కేకే, కేఆర్ సెక్షన్‌లలో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగుల సీనియారిటీ, బదిలీ హక్కులు, భవిష్యత్ సేవా ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. వెంటనే ఈ విషయమై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.


