పర్లాకిమిడి: గిరిజనులు గంజాయి పంటలు వీడి.. వాణిజ్య పంటలు పండించాలని అధికారులు సూచిస్తున్నారు. గజపతి జిల్లాలోని మోహనా, ఆర్.ఉదయగిరి, అడవ ప్రాంతాల్లో గంజాయి సాగు గిరిజనులకు ప్రధాన జీవనాధారంగా మారింది. దీంతో గత కొద్ది నెలలుగా పోలీసులు, ఎకై ్సజ్, ఫారెస్టు అధికారులు వరుస దాడులు చేయడంతో అనేక మంది పట్టుబడ్డారు. దీంతో పలు గిరిజన కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గంజాయి పంటను పూర్తిగా నిర్మూలించేందుకు ఆర్.ఉదయగిరి సబ్ డివిజనల్ పోలీసు అధికారి రాకేష్ కుమార్ సాహు (ఐపీఎస్) మంగళవారం మారుమూల ఆదివాసీ ప్రాంతాల గిరిజనులు, సర్పంచ్‌లను ఆర్.ఉదయగిరి పిలిపించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆదివాసీ ప్రజలతో ఈ పరస్పర చర్చా కార్యక్రమంలో మోహనా వ్యవసాయ అధికారి కూడా పాల్గొన్నారు. గంజాయి పంట బదులు ప్రభుత్వం అందిస్తున్న వివిధ వ్యవసాయ పథకాలు, పనిముట్లు సబ్సిడీ ధరలకే లభిస్తున్నాయని, అలాగే ఆయా ప్రాంతంలో మొక్కజొన్న, పైనాపిల్, బత్తాయి పంటలు పండించేందుకు అనుకూల వాతావరణం ఉందన్నారు. అందువల్ల ప్రతీ గిరిజన రైతు కొండవాలు ప్రాంతంలో వాణిజ్య పంటలు వేయాలని, అందుకు తనవంతు సహకారం అందిస్తానని వెల్లడించారు.


