విద్యార్థుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ఆందోళన

Jul 21 2026 12:29 AM | Updated on Jul 21 2026 12:29 AM

● నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంపై..

● నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంపై..

రాయగడ: వైద్య విద్య కోసం జాతీయస్థాయిలో నిర్వహించిన నీట్‌ ప్రవేశ పరీక్షలో చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్న ప్రశ్నపత్రం లీక్‌, పరీక్షల నిర్వహణలో అవకతవకలు, విద్యావ్యవస్థలో నెలకొన్న లోపాలను నిరసిస్తు రాయగడలో విద్యార్థులు, యువజనులు, సామాజిక కార్యకర్తలు, సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. స్థానిక కపిలాస్‌ కూడలి నుంచి భారీ ర్యాలీగా విద్యార్థి సంఘాలు వెళ్లి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ప్రధాన గేట్‌ వద్ద నిరసన తెలియజేశారు. జిల్లా కలెక్టర్‌ ద్వారా భారత రాష్ట్రపతి పేరుతో వినతిపత్రాన్ని నిరసనకారులు డిప్యూటీ కలెక్టర్‌ మనవాల్‌ ప్రియదర్శినికి సమర్పించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నైతిక బాధ్యత వహిస్తు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. వరుసగా ప్రశ్నపత్రాల లీక్‌ ఘటనలు విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుకోవడమేనని ఆరోపించారు. దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టివేస్తున్న ఈ ఘటన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

న్యాయవిచారణ జరిపించాలి

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో స్వతంత్ర, కాలపరిమితి ఉన్న ఉన్నతస్థాయి విచాణ కమిటీని ఏర్పాటు చేయాలని, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీలో సమగ్ర సంస్కరణలు చేపట్టి పరీక్షల నిర్వహణకు మరింత పారదర్శకంగా, లోపరహితంగా మార్చాలని కోరారు. పరీక్షల కారణంగా నష్టపోయిన విద్యార్థుల కోసం ప్రత్యేక సంక్షేమ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు పార్లమెంట్‌ ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో విద్యావ్యవస్థ సంక్షోభంపై చర్చించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు తుషార్‌ కాంత్‌ తురుక్‌ మాట్లాడుతూ.. ఢీల్లిలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేస్తున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్‌ను పోలీసులు బలవంతంగా తరలించిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయనకు సంఘీభావం ప్రకటించేందుకే ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ఈ ఆందోళన కార్యక్రమానికి కోక్రొచ్‌ జనతాదళ్‌ తమ మద్దతును ప్రకటించి సభ్యులు, ప్రతినిధులు ఆందోళనలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement