రాయగడ: ఆపరేషన్ నేత్రలో భాగంగా ఝార్సుగుడ పోలీసులు చొరీ కేసును దర్యాప్తు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఎస్‌పీ జి.ఆర్.రాఘవేంద్ర ఈ కేసుకు సంబంధించి వివరాలను మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. ఈ నెల 17వ తేదీ రాత్రి గుర్తు తెలియని కొందరు దుండగులు ఓ ఇంటి తలుపు పగుల గొట్టి రెండు మోబైల్ ఫోన్లు, నగదును అపహరించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారం ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలొ వారు చోరీ చేసినట్లు అంగీకరించారు. అంతేకాకుండా జూలై 18వ తేదీ సాయంత్రం ఝండా చౌక్ సమీపంలొ పార్కింగ్ చేసిన ఒక ద్విచక్ర వాహనాన్ని కూడా తామే దొంగిలించినట్లు నిందితులు అంగీకరించారు. అరెస్టయిన వారిలో ఝార్సుగుడ జిల్లాలోని బురొమాల్ గ్రామానికి చెందిన శివమహానంద్ అలియాస్ నాయక్, సూరజ్ శంకర్, భరద్వాజ్ కాక్ అలియాస్ మండల్‌లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితులను కోర్టుకు తరలించారు.


