రాయగడ: ఝార్సుగుడ జిల్లాలోని కొలాబిర పోలీస్‌స్టేషన్ పరిధిలో గ్రామీణ తాగునీటి పథకాలు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు విద్యుత్ సరఫరా చేసే అల్యూమినియం విద్యుత్ తీగలను చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర స్క్రాప్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రఘునాథ్‌పల్లి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కొలాబిర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో భాగంగా అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి గ్రామీణ నీటి సరఫరా పథకాలకు ఉపయోగించే సుమారు 3,600 మీటర్ల 11 కేవీ అల్యూమినియం విద్యుత్ తీగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తీగలను ఝార్సుగుడలోని పురుబాస్తి ప్రాంతంలోని స్క్రాప్ గోదాంలో దాచిపెట్టి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టయిన నిందితులు బాబులు అలియాస్ అబ్దుల్ కయ్యం, బల్లా అలియాస్ అబ్దుల్ రహీమ్, అజ్మైల్ మీర్, అష్రప్ రజా లుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ కు చెందిన వారుగా పోలీసులు భావిస్తున్నారు. నిందితుల వద్ద నుంచి బొలేరొ వాహనం ఆరుకట్టలుగా కత్తిరించిన విద్యుత్ తీగలు, వైర్ కట్టర్, ప్లాస్టిక్ తాడు స్వాదీనం చేసుకున్నారని ఎస్పీ జీఆర్ రాఘవేంద్ర తెలియజేశారు.


